భక్తి ఎగసె.. గోదారి మురిసె
భక్తి ఎగసె.. గోదారి మురిసె
Published Mon, Aug 8 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎగసింది.. తన చెంతకొచ్చిన బిడ్డల తన్మయత్వాన్ని చూసి గోదారమ్మ మురిసింది. అందుకేనేమో.. ఆ తల్లి గోదారి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. అంత్య పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిశాయి.
ఓ వైపు వరద గోదారి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు భక్తులు సైతం వరదలా తరలివస్తున్నారు. అంత్య పుష్కరాల్లో తొమ్మిదో రోజైన సోమవారం నదీ తీరమంతా జన సందోహంతో కిటకిటలాడింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చారు. సోమవారం ఇక్కడ 60 వేల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. వరద పోటెత్తడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లను పూర్తిగా మూసివేశారు. మరో మూడు రోజుల్లో గోదావరి అంత్య పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. పట్టిసీమ పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పోలవరం, గూటాల ఘాట్లలో వరద ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య తగ్గలేదు. సిద్ధాంతంలో కేదారేశ్వరుడు కొలువుతీరడం, సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. 13 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో ఘాట్ల వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. భక్తులు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. కేదారీఘాట్‌లో గల మూడు రేవుల్లో ఒక రేవును మూసివేశారు. పెరవలి మండలంలో గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. మహిళలు గోదారమ్మకు పసుపు, కుంకుమ చీరసారెలతో పూజలు నిర్వహించారు. ఎనిమిది పుష్కర ఘాట్లలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిం చారు. నరసాపురంలోని ఘాట్లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వలంధర రేవు, అమరేశ్వర ఘాట్ల వద్ద రద్దీ నెలకొంది. స్నానాల అనంతరం శివాలయాలను దర్శించుకుని పూజలు చేశారు. పోలీస్ యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బంది కృష్ణా పుష్కరాలకు వెళ్లిపోవడంతో మొత్తం భారం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లపై భారం పడింది. ఉదయం సముద్రంలో పాటు కారణంగా ఘాట్లలో నీటిమట్టం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది. ఘాట్‌కు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడ పుష్కర స్నానాలను నిలుపుదల చేశారు
Advertisement
Advertisement