పాపం పసివాడు
బాల్యంలో బతుకుభారం
అమ్మానాన్నలకు దూరం... ఆదుకునేవారు కరువు
అనాథకు ఆసరాగా నిలవని అంత్యోదయకార్డు
మెదక్ రూరల్: చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథగా మారిన ఓ పసివాడిని విధి వంచిస్తే... ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులు రాకుండా అంత్యోదయకార్డును తొలగించిన అధికారులు ఆ పసివాడి కడుపు మాడుస్తున్నారు. మండలంలోని రాజ్‌పేటకు చెందిన బోయిని పవన్‌శ్రీకర్‌ను ఊహ తెలియని వయస్సులోనే తల్లి వదిలేసి వెళ్లిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించాడు.
దీంతో తల్లిదండ్రుల ఆలనా పాలనలో గడపాల్సిన బాల్యం ఒంటరితనాన్ని మిగిల్చింది. పవన్‌శ్రీకర్ నానమ్మ బోయిని ఊశమ్మ మనవడిని తనకు వచ్చే పింఛన్ డబ్బులతో బతికిస్తూ బడికి పంపుతోంది. ప్రస్తుతం పవన్‌శ్రీకర్ అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం పవన్‌శ్రీకర్‌తోపాటు నానమ్మ ఊశమ్మకు చెందిన అంత్యోదయకార్డును అధికారులు తొలగించారు.
దీంతో రేషన్ సరుకులు రాకపోవడంతో ఆ నానమ్మ, మనవళ్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీసం ఉండడానికి ఇళ్లు కూడా లేని ఆ అభాగ్యులు గ్రామంలోని పొరుగువారి పంచన బతుకీడుస్తున్నారు. కాటికి కాలు చాపుకొని ఉన్న నేను మట్టిలో కలిసిపోతే పసివాడైన నా మనవడికి దిక్కెవరని ఆ వృద్ధురాలు ఊశమ్మ కన్నీటి పర్యంతమవుతోంది.
ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉన్నా పవన్‌ను చదివించే స్థోమత లేక వృద్ధురాలు ఆ బాలుడి భవిష్యత్‌ను గురించి కుంగిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంత్యోదయ కార్డు సరిచేసి రేషన్ సరుకులు ఇప్పించి తన మనవడు పవన్‌శ్రీకర్‌ను ఆదుకోవాలని వృద్ధురాలు ఊశమ్మ వేడుకుంటోంది.