ప్రేమోన్మాదం
మహబూబ్‌నగర్ క్రైం: ప్రేమను నిరాకరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్‌తో యువతి గొంతు కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘట న చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం బాదేపల్లికి చెందిన అనుదీప్ స్విట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు చెందిన సౌమ్య(18) కూడా చదువుతోంది. ఇద్దరూ క్లాస్మేట్స్ కావడంతో ఏడాదిగా తనను ప్రేమించాలంటూ అనుదీప్ ఆమెపై ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తుంది. ఇటీవల వేధింపులు తీవ్రం కావడంతో యువతిని ఆమె తల్లిదండ్రులు కళాశాల మాన్పించారు.
దీంతో ఆగ్రహించిన అనుదీప్.. సోమవారం రాత్రి సౌమ్య ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని ఇంట్లో చొరబడ్డాడు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనుదీప్ తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో ఆమె గొంతు, తల భాగంలో కోశాడు. భయాందోళనతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అనుదీప్‌ను బంధించారు. అయితే అనుదీప్ కుర్చీలపై దుస్తులు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో అతనికి గాయాలయ్యాయి. అలాగే.. బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గాయపడిన అనుదీప్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యతో ఎస్పీ రెమారాజేశ్వరి, డీఎస్పీ భాస్కర్ మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.