వసతిగహం తరలింపుపై ప్రజాగ్రహం
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన విద్యార్థులు, ప్రజలు
అధికారులను నిలదీసి.. నిరసన తెలిపిన వైనం
అనుమసముద్రంపేట : మండలంలోని గుంపర్లపాడులో ఉన్న బీసీ బాలుర వసతిగహాన్ని ఆత్మకూరు గిరిజన సంక్షేమ వసతిగహంలో మెడ్జ్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి సంజీవరావు తల్లిదండ్రులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వసతిగహాలు ఏర్పాటు చేసిందన్నారు. ఆత్మకూరులో అన్నీ వసతులతో కూడిన భవనం నిర్మించారని, అందులోకి ఈ వసతిగహాన్ని మెడ్జ్ చేస్తున్నట్లు చెప్పారు.
వద్దే వద్దు..
వసతిగహం తరలింపునకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు. ఉన్న హాస్టల్‌ను తొలగించడం ఏంటని అధికారులను నిలదీశారు. వసతిగహంలో అనేకమంది డ్రాపౌవుట్స్ను తీసుకువచ్చి చేర్పించారని, వందమందికిపైగా ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో చదువుతున్నారని వాపోయారు. హాస్టల్ తరలిస్తే మళ్లీ చిన్నారులు బడిమానేస్తారని అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వసతిగహాలు ఏర్పాటుచేసి విద్య అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఉన్న గహాలను తొలగించడం ఎంతవరకు సమంజసమని అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా వసతిగహం ఉందని దీనిని తరలించడం మాని మెరుగైన సౌకర్యాల కల్పనకు కషిచేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు వారు వసతిగహం తొలగించడానికి వీలులేదని ఏకగ్రీవంగా తీర్మానించి అర్జీలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూఓ నరసారెడ్డి, ఏఎస్‌పేట, గుంపర్లపాడు వార్డెన్లు మహబూబ్‌బాష, రాజగోపాల్, సర్పంచ్ స్రసాద్, మాజీ సర్పంచులు నరసారెడ్డి, రత్నం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.