రెండోరోజూ దొరకని అన్వేష్ ఆచూకీ
జియ్యమ్మవలస:మండలంలోని రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన విద్యార్థి జి.అన్వేష్ ఆచూకీ రెండోరోజూ లభించలేదు. జాలర్లతో వెతికించినా తమ కుమారుడి ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.కురుపాం మండల కేంద్రంలో శోభలతాదేవి కాలనీకి చెందిన అన్వేష్ అదే కాలనీకి చెందిన స్నేహితులతో వట్టిగెడ్డలో సోమవారం ఈతకొట్టి గల్లంతైన విషయం విదితమే. సోమవారం సాయంత్రం చీకటి పడినంత వరకు ఈతగాళ్లతో వెతికించినా అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో మంగళవారం కూడా రావాడలో చేపలు పట్టే జాలర్లతో పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెతికించారు.సాయంత్రం 5 గంటల వరకు వెతికినా ఆచూకీ దొరకలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పప్పల పాపారావు తెలిపారు. అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు, దగ్గర బంధువులు,స్నేహితులు రావాడ వట్టిగెడ్డకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం చేయాలి
కురుపాం: రెండో రోజు గాలించినా అన్వేష్ ఆచూకీ తెలియరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కురుపాం పోలీస్టేషన్‌కు చేరుకుని అన్వేష్ ఏమయ్యాడో వెంటనే విచారణ వేగవంతం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అన్వేష్ స్నేహితులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే అన్వేష్ ఆచూకీ లభించడం లేదని మండిపడ్డారు. దీంతో కురుపాం ఎస్సై ఎన్.అశోకచక్రవర్తి మాట్లాడుతూ సంఘటన తమ పరిదిలో జరగక పోయినా గల్లంతైన అన్వేష్ కురుపాం వాసి కావడంతో చినమేరంగి-కురుపాం పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరంగానే నిర్వహిస్తున్నామని నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని అన్వేష్ బంధువులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.