రూ.46 కోట్లతో వైఎస్సార్ విత్తన పరిశోధన కేంద్రం
సాక్షి,గన్నవరం: రాష్ట్రంలో మొదటిసారిగా రూ.46 కోట్లు వ్యయంతో కృష్ణాజిల్లా గన్నవరంలోని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంస్థ ఆవరణలో నిర్మిస్తున్న వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సింహాద్రి రమేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ ఇప్పటివరకు విత్తన పరిశోధన కేంద్రం జాతీయస్థాయిలో వారణాసిలో మాత్రమే ఉందన్నారు.
తొలిసారిగా రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించడం రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని ఏడాదిలోపు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన, అన్ని వాతావరణాలను తట్టకుని మంచి దిగుబడులిచ్చే విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ జె.రాఘవరావు, ఏఎంసీ చైర్మన్ రామిశెట్టి అంజనీకుమారి, ఎంపీపీ అనగాని రవి తదితరులు పాల్గొన్నారు.