apes
-
వానర రహస్యం రట్టయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం... మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెరి్నంగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట! -
చింపాజీలకు మనకు పెద్ద తేడా ఏమీలేదు
న్యూయార్క్: ఏదైనా పనిని సమష్టిగా చేయడం లేదా చేసే పనిలో పరస్పరం సహకరించుకోవడం కేవలం మానవుల లక్షణమని, ఈ లక్షణమే జంతువుల నుంచి మానవులను వేరు చేస్తుందని ఇంతకాలం శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ అభిప్రాయం తప్పని, పరస్పరం సహకరించుకునే లక్షణం లేదా గుణం జంతువుల్లో కూడా ఉందని వారు పరిణామక్రమంలో మానవుడికి దూరబంధువులైన చింపాజీల ప్రవర్తనపై జరిపిన అధ్యయనం ద్వారా తేల్చారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయన వివరాలను అమెరికా నుంచి వెలువడుతున్న ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో ప్రచురించారు. గతంలో వారు ల్యాబ్ కండీషన్ లో చింపాజీల ప్రవర్తనపై అధ్యయనం జరపగా, అప్పుడు అవి పరస్పర సహకారానికి బదులుగా పోటీకి, సంఘర్షణకే దిగాయి. దీంతో పరస్సరం సహకరించుకునే లక్షణం విలక్షణంగా మానవులకే ఉందని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. కానీ వారు ఇటీవల 11 చింపాజీలను 96 గంటలపాటు సహజ వాతావరణంలో వదిలేసి వాటి ప్రవర్తనపై అధ్యయనం జరిపారు. యెర్క్స్ నేషనల్ ప్రిమేట్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. చింపాజీలు తమకు అవసరమైన షెల్టర్‌ను నిర్మించుకోవడానికిగానీ, ఆహారాన్ని సేకరించుకోవడానికిగానీ ముందుగా పోటీ పడ్డాయి. పరస్పరం గొడవలకు దిగాయి. ఆ తర్వాత పరస్పర సహకారంతోనే ఎక్కువ ప్రయోజనం ఉందనే విషయాన్ని అవి గ్రహించాయి. రెండు, మూడు లేదు నాలుగు బృందాలుగా విడిపోయి పరస్పరం సహకరించుకున్నాయి. అవి 96 గంటల కాలంలో 3,656 సార్లు పరస్పర సహకార చర్యలకు దిగగా, కేవలం 600 సార్లు మాత్రమే పోటీకి, గొడవకు దిగాయి. ఇలా పోటీకి దిగడం, పరస్పరం సహకరించుకుంటూ జీవనం గడపడం మానవుల్లో ఉండే లక్షణమే. పెద్దరికం చెలాయిస్తూ తోటి చింపాజీలతో ఉచితంగా పనిచేయించుకునేందుకు కొన్ని చింపాజీలు ప్రయత్నించడం, వాటి ఆదేశాలను మిగతా చింపాజీలు పాటించేందుకు నిరాకరించడమూ అధ్యయనంలో కనిపించింది. ఈ లక్షణం కూడా మానవుల్లో సహజంగా ఉండేదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ అధ్యయనం ఫలితాలు చింపాజీల నుంచి మానవుల పూర్వికులు ఆవిర్భవించారనే పరిణామ సిద్ధాంతానికి మరింత ఊతమిస్తున్నాయని వారన్నారు. అంతేకాకుండా చీమల నుంచి తిమింగలాల వరకు పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇస్తాయన్న విషయం తేలిందని వారంటున్నారు. అనవసరమైన పోటీలకు దిగి గొడవలు పడడం, ఉచితంగా తోటి వారి సాయం పొందాలని ఆశించడం కన్నా పరస్పర సహకారానిదే అంతిమ విజయమని తమ అధ్యయనం నిరూపించిందని వారు చెప్పారు. -
చింపాంజీలూ సీన్లు గుర్తుపెట్టుకుంటాయి!
చింపాంజీలు మానవులతో దగ్గరి పోలికలు కలిగి ఉండటమే కాదు మనుషుల్లాగే సామర్థ్యం కలిగి ఉంటాయని అనేక పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. తాజాగా వాటి సామర్థ్యంపై మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చింపాంజీలు, బొనొబోలు మనుషుల్లాగే ప్రతి సీన్ ను సీక్వెన్స్ లో గుర్తుంచుకోలేకపోయినా... సినిమాల్లోని వివిధ సన్నివేశాలను బాగా గుర్తు పెట్టుకోగలుగుతాయని జపాన్ పరిశోధకులు చెప్తున్నారు. ఐ ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగించి చింపాంజీలు ఏ విధంగా వీడియోలను వీక్షిస్తున్నాయో రికార్డ్ చేశారట. ఓ వీడియో క్లిప్పును 24 గంటల తర్వాత మరోసారి చూపించినప్పుడు... అవి రాబోయే సన్నివేశం ఏమిటో తెలిసినట్లుగా ప్రవర్తించడం గమనించామని జపాన్ లోని క్యోటో యూనివర్శిటీ వైల్డ్ లైఫ్ రీసెర్స్ విభాగం రచయిత ఫ్యుమిహిరో కానో చెప్పారు. అధ్యయనకారుల బృందం 'కింగ్ కాంగ్ అటాక్'', ''రివేంజ్ టు కింగ్ కాంగ్'' అనే రెండు షార్ట్ ఫిల్మ్ లను చింపాంజీలకు చూపించగా.. అంతకు ముందు చూడని సన్నివేశాలకంటే... సినిమాలో ఒకే రకమైన వాతావరణాన్నిపోలిఉన్న సన్నివేశాలు వచ్చినపుడు అవి గుర్తించాయట! ఒక సినిమాలోని కింగ్ కాంగ్ అటాక్ చేసిన సన్నివేశం చూపించి... ఇరవై గంటల తర్వాత మరోసారి ఆ సినిమా చూపించినప్పుడు మునుపటి సన్నివేశంలో కాంగ్ వచ్చేవైపు అవి ఆత్రుతగా దృష్టిని సారించడాన్ని అధ్యయనకారులు గమనించారు. ఒక్కసారి ఒక సన్నివేశాన్ని చూశాయంటే చాలు అవి ఇక మర్చిపోవని క్యోటో వర్శిటీ పరిశోధక బృందం సభ్యురాలు సంతోషి హిరాటా అంటున్నారు. ఈ సామర్థ్యం చింపాంజీలకు రాబోయే ప్రమాదం నివారించడానికి పలు పర్యావరణాల్లో నివసించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనకారిణి హరిత అంటున్నారు. -
వారి తీరు కోతుల కంటే హీనం
తొర్రూరు: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు కోతుల కంటే హీనంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తొర్రూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందన్నారు. ఇంకా ప్రజా సమస్యలు ఉంటే చర్చించాల్సిన సభలో ఏం మాట్లాడాలో తెలి యక టీడీపీ సభ్యులు బల్లలు ఎక్కి, మైక్‌లు విరగ్గొట్టి రౌడీల్లాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే దొంగచాటున తెలంగాణ టీడీపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారన్నారు. బీజేపీకే ఓటు వేస్తే మళ్లీ ఆంధ్ర పార్టీ అయిన చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని పునరుద్ఘాటించారు. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ ముసుగులో వస్తున్న పక్క రాష్ట్ర పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. బంగారు తెలంగాణ కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పొరపాటున బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కితే తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందంటూ విషప్రచారం చేసే ప్రమాదం ఉందన్నారు.