న్యూయార్క్: ఏదైనా పనిని సమష్టిగా చేయడం లేదా చేసే పనిలో పరస్పరం సహకరించుకోవడం కేవలం మానవుల లక్షణమని, ఈ లక్షణమే జంతువుల నుంచి మానవులను వేరు చేస్తుందని ఇంతకాలం శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. కానీ ఆ అభిప్రాయం తప్పని, పరస్పరం సహకరించుకునే లక్షణం లేదా గుణం జంతువుల్లో కూడా ఉందని వారు పరిణామక్రమంలో మానవుడికి దూరబంధువులైన చింపాజీల ప్రవర్తనపై జరిపిన అధ్యయనం ద్వారా తేల్చారు.
శాస్త్రవేత్తలు తమ అధ్యయన వివరాలను అమెరికా నుంచి వెలువడుతున్న ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో ప్రచురించారు. గతంలో వారు ల్యాబ్ కండీషన్ లో చింపాజీల ప్రవర్తనపై అధ్యయనం జరపగా, అప్పుడు అవి పరస్పర సహకారానికి బదులుగా పోటీకి, సంఘర్షణకే దిగాయి. దీంతో పరస్సరం సహకరించుకునే లక్షణం విలక్షణంగా మానవులకే ఉందని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. కానీ వారు ఇటీవల 11 చింపాజీలను 96 గంటలపాటు సహజ వాతావరణంలో వదిలేసి వాటి ప్రవర్తనపై అధ్యయనం జరిపారు. యెర్క్స్ నేషనల్ ప్రిమేట్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
చింపాజీలు తమకు అవసరమైన షెల్టర్‌ను నిర్మించుకోవడానికిగానీ, ఆహారాన్ని సేకరించుకోవడానికిగానీ ముందుగా పోటీ పడ్డాయి. పరస్పరం గొడవలకు దిగాయి. ఆ తర్వాత పరస్పర సహకారంతోనే ఎక్కువ ప్రయోజనం ఉందనే విషయాన్ని అవి గ్రహించాయి. రెండు, మూడు లేదు నాలుగు బృందాలుగా విడిపోయి పరస్పరం సహకరించుకున్నాయి. అవి 96 గంటల కాలంలో 3,656 సార్లు పరస్పర సహకార చర్యలకు దిగగా, కేవలం 600 సార్లు మాత్రమే పోటీకి, గొడవకు దిగాయి. ఇలా పోటీకి దిగడం, పరస్పరం సహకరించుకుంటూ జీవనం గడపడం మానవుల్లో ఉండే లక్షణమే. పెద్దరికం చెలాయిస్తూ తోటి చింపాజీలతో ఉచితంగా పనిచేయించుకునేందుకు కొన్ని చింపాజీలు ప్రయత్నించడం, వాటి ఆదేశాలను మిగతా చింపాజీలు పాటించేందుకు నిరాకరించడమూ అధ్యయనంలో కనిపించింది. ఈ లక్షణం కూడా మానవుల్లో సహజంగా ఉండేదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తమ అధ్యయనం ఫలితాలు చింపాజీల నుంచి మానవుల పూర్వికులు ఆవిర్భవించారనే పరిణామ సిద్ధాంతానికి మరింత ఊతమిస్తున్నాయని వారన్నారు. అంతేకాకుండా చీమల నుంచి తిమింగలాల వరకు పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇస్తాయన్న విషయం తేలిందని వారంటున్నారు. అనవసరమైన పోటీలకు దిగి గొడవలు పడడం, ఉచితంగా తోటి వారి సాయం పొందాలని ఆశించడం కన్నా పరస్పర సహకారానిదే అంతిమ విజయమని తమ అధ్యయనం నిరూపించిందని వారు చెప్పారు.
చింపాజీలకు మనకు పెద్ద తేడా ఏమీలేదు
Published Wed, Aug 24 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement
Advertisement