appendix
-
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా.. ఎక్కువైంది. మళ్లీ ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అలా 12 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూనే ఉంది. తాజాగా ఈనెలలో మరోసారి ఆసుపత్రికి వెళ్లగా.. కడుపు నొప్పికి గల కారణం తెలిసి కుటుంబం షాక్‌కు గురైంది. సదరు మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.అసలేం జరిగిదంటే.. 45 ఏళ్ల మహిళ 2012లో గాంగ్టక్లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ హాస్పిటల్లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ తరువాత ఊడా ఆమెకు కడుపులో నొప్పి కొనసాగుతూనే ఉంది. చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. తిరిగి వస్తూనే ఉంది. ఇలా పదేళ్లకుపైగా బాధపడుతూనే ఉంది. అక్టోబర్ 8న, ఆమె మళ్లీ ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్-రేలో ఆమె కడుపులో శస్త్రచికిత్స కత్తెర ఉన్నట్లు బయటపడింది. 12 క్రితం అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న సమయంలో వైద్యులు ఆమె కడపులో ఓ కత్తెరను పెట్టి మర్చిపోయినట్లు తేలింది.అయితే ఇన్నేళ్లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా వైద్య నిపుణుల బృందం వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా!
మన చిన్న పేగులూ, పెద్దపేగు కలిసే జంక్షన్లో అపెండిక్స్ అనే చిన్న తోక లాంటిది ఉంటుంది. అన్ని అవయవాల మాదిరిగానే దీనికీ క్యాన్సర్ సోకుతుంది. అయితే ఇది చాలా అరుదు. ఇలాంటి క్యాన్సర్ వచ్చినవారితో పాటు మరికొన్ని గడ్డల వల్ల పొట్టకుహరంలో మ్యూసిన్ అనే స్రావాలు స్రవిస్తాయి. ఈ కండిషన్‌ను ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అన్ని క్యాన్సర్లలాగే ఇది కూడా కడుపు లేదా దాని పరిసరాల్లో ఉండే ఇతర ప్రాంతాలకూ, అవయవాలకూ విస్తరిస్తుంది. సీటీ స్కాన్ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. దాంతో వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యమవుతుంది. దాంతో అపెండిక్స్ క్యాన్సర్ రోగుల్లో చాలామంది మృతువు బారిన పడుతుంటారు. త్వరగా గుర్తిస్తే అన్ని క్యాన్సర్లలాగే దీనికీ చికిత్స చేయవచ్చు. చికిత్స ఒకింత కష్టమే అయినప్పటికీ... ప్రస్తుతం దీనికి ‘హైపెక్’ అనే అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది. హైపర్ థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అనే ప్రక్రియకు సంక్షిప్తరూపమే ఈ ‘హైపెక్’. ఇందులో ఉదరభాగంలోని పెరిటోనియమ్ (ఒక పొరలాంటి తొడుగు)ను మొత్తం తొలగించి, ఓ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్) వద్ద కీమోథెరపీ మందునంతా ఆ భాగంలో సమంగా విస్తరించేలా చేస్తారు. ఇలా 60 నుంచి 90 నిమిషాల పాటు చేయడం ద్వారా ఈ సూడో మిక్సోమా పెరిటోనీ తిరగబెట్టడాన్ని చాలాకాలం పాటు వాయిదా వేయవచ్చు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
పొరపాటున కండోమ్ మింగేసిందట!
కామెరూన్: కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్‌లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్‌లో ఉన్న కండోమ్‌ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు. వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి అపెండిక్స్ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి వారు షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన డాక్టర్లు చివరికి కండోమ్గా తేల్చారు. కండోమ్‌ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్‌ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది. -
పేగుబంధమే ప్రాణం పోసింది!
కళ్లు తెరవగానే బిడ్డ తల్లి ముఖమే చూస్తాడు. తన తల్లి పొత్తిళ్లలోనే సేదదీరుతాడు. కానీ చైనాకి చెందిన గావో కియాంబోకి అంత అదృష్టం లేకపోయింది. ఎందుకంటే... ఆ బాబు కడుపులో ఉన్నప్పుడు అతడి తల్లి ఝాంగ్ రాంగ్జియాంగ్కి ఓ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఇక కోలుకోలేదని, ఏ క్షణాన్నయినా మరణించవచ్చని తేల్చేశారు వైద్యులు. సరిగ్గా అప్పుడే తెలిసింది వారికి... ఆమె కడుపులో ఓ బిడ్డ పెరుగుతోందని. దాంతో ఏవేవో ప్రయత్నాలు చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టారు. నెలలు నిండగానే సిజేరియన్ చేసి బుజ్జి కియాంబోని ఈ లోకంలోకి తీసుకొచ్చారు. తల్లి పరిస్థితి తెలియక గుక్కపెట్టి ఏడ్చే కియాంబోని చూసి తండ్రి కలత చెందేవాడు. వాడి ఏడుపును ఆపడం కోసం తల్లి పక్కన పడుకోబెట్టేవాడు. తల్లి స్పర్శ సోకగానే ఏడుపు ఆపేసేవాడు కియాంబో. రెండేళ్లు వచ్చాకయితే... తల్లి పక్కనే కూర్చుని, తల్లిని పట్టి కుదుపుతూ ‘‘అమ్మా లేమ్మా’’ అంటూ ఏడ్చేవాడు. వాడి పిలుపుకి ఆ తల్లి మనసు స్పందించిందో లేక తన బిడ్డ వేదన చూసి... అచేతనమైపోయిన ఆమె నరనరమూ చలించిందో తెలియదు కానీ... ఝాంగ్ ఇటీవలే కళ్లు తెరిచింది. నలభై రెండేళ్ల ఆ తల్లి... తన రెండేళ్ల కొడుకుని తొలిసారి చూసుకుని మురిసిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి వైద్యులు సైతం విస్తుపోయారు. ఝాంగ్ కోలుకుంటోంది. కానీ ఇంకా ఘనాహారం తీసుకోలేకపోతోంది. దాంతో అమ్మ కడుపు నింపే బాధ్యతను కూడా బుజ్జి కియాంబోనే తలకెత్తుకున్నాడు. తన చిన్ని నోటితో ఆహారాన్ని నమిలి తన తల్లి నోటికి అందిస్తాడు. ఝాంగ్ దాన్ని ఆనందంగా ఆరగిస్తుంది. తల్లీబిడ్డల అనుబంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరోటి ఉంటుందా!