సంక్షేమ పథకాలకు గడువు పొడిగింపు
సాక్షి,సిటీబ్యూరో : సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పథకాల దరఖాస్తు గడువును జూన్ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయా సంక్షేమ శాఖలు లబ్ధిదారుల కోసం వేట ప్రారంభించారు. అందుకోసం ఈ నెల 7 నుంచి బస్తీల వారిగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల నుంచి 1000 పైగా దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీ రుణాల మంజూరు తదితర పథకాలకు ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ, యువజన సంక్షేమ శాఖలకు నిధులు విడుదల చేశారు.
2014-15 సంవత్సరానికి ఎస్సీ,ఎస్టీ,యువజన సంక్షేమ శాఖలకే రూ.14.90 కోట్లు నిధులు మంజూరు చేయగా,..ఆర్థిక సంవత్సరంలో రూ. 2.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు రూ.12.14 కోట్ల నిధులను జూన్ నెలాఖరుకల్లా ఖర్చు చేసే విధంగా ఆయా సంక్షేమ శాఖలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
లబ్థిదారుల కోసమే క్యాంపులు: ఏజేసీ సంజీవయ్య
సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకుగాను అర్హుల ఎంపిక కోసం జిల్లాలోని 8 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. క్యాంపులు ముగియగానే లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తాం.