Appointment orders
-
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
ఆ నియామక పత్రాల జాడేది?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో వివిధ కేటగిరీల్లో కొత్తగా ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులు ఇంకా కొలువుదీరలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు నాలుగునెలలు కావొస్తున్నా, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలో 9వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి అర్హత పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) 8,600 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్(పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్(డీఎల్) కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు గురుకులబోర్డు చర్యలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదాపు 7,100 మందికి రెండు దఫాలుగా నియామక పత్రాలు అందజేసింది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేయలేదు. కోడ్ ముగిసిన తర్వాత ఇవ్వాలని గురుకులబోర్డు నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు కావొస్తున్నా వీటి పంపిణీపై స్పష్టత లేదు. పోస్టింగ్‌కు లింకు... రాష్ట్రవ్యాప్తంగా గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురుకుల సొసైటీలు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందుకు కారణం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రాలు అందించకపోవడమే. నియామకపత్రాలు అందించిన వారికి ముందుగా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా, సరీ్వసులో వ్యత్యాసం నెలకొంటుందనే భావన, మరోవైపు కౌన్సెలింగ్‌లో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెనక్కి తగ్గారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రా లు ఇచి్చన తర్వాత పోస్టు కేటగిరీల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ ఇచ్చేందుకు సొసైటీలు నిర్ణయించాయి. జూన్ 6వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ కోడ్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా... గురుకుల బోర్డు నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభించినా, పూర్తి చేసేందుకు కనీసం రెండువారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కనీసం వచ్చే నెల నుంచైనా కొత్త టీచర్లు విధుల్లో చేరతారో లేదో వేచి చూడాలి. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
సచివాలయ ఉద్యోగులకు రేపు నియామక పత్రాలు
సాక్షి, అమరావతి: పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
30న సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు
సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగులకు 30న అపాయిమెంట్ ఆర్డర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వార్డు సచివాలయాల్లో 10 మంది ఉద్యోగులు ఉంటారని.. గ్రామ,వార్డు సచివాలయాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రజా పాలన సచివాలయాల ద్వారానే జరుగుతుందన్నారు. అక్టోబర్ 2 నుంచి సచివాలయాల్లో పౌరసేవలు అందిస్తామని తెలిపారు. 72 గంటల్లో పూర్తయ్యే 10 సేవలను తక్షణమే అమలు చేస్తామన్నారు. తర్వాత ఆ సేవలను పెంచుకుంటూ వెళ్తామన్నారు. పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు 72 గంటల్లో ఇస్తామని వెల్లడించారు. డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలు వెంటనే ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతీరోజు వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, పింఛన్లు, ఫీజు రియింబర్స్‌మెంట్ తదితర పథకాలను సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని తెలిపారు -
వీఆర్ఓ, వీఆర్ఏల పోస్టుల భర్తీకి చర్యలు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 48 వీఆర్వో, 145 వీఆర్ఏ పోస్టుల భర్తీకి 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్లోని తనచాంబర్లో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన వీఆర్వో, వీఆర్ఏలకు జనవరి నెలాఖరులోగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నామన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 27న తహశీల్దార్లకు శిక్షణ జిల్లాలోని తహశీల్దార్లకు ఈనెల 27న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. ఎఫ్ లైన్ పిటిషన్లు, సబ్ డివిజన్ అంటే ఏమిటి, ఫీల్డ్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్స్ ఎలా రీబిల్డింగ్ చేయాలన్న దానిపై శిక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జిల్లాలో 83 శాతం పూర్తయిందని మిగిలిన 17 శాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో త్వరలో జరగనున్న ఏడో విడత భూపంపిణీకి సంబంధించిన భూసర్వేను పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ పెంచలరెడ్డి, తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. 11 మంది వీఆర్ఏలకు పదోన్నతులు జిల్లాలోని 11 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించనున్నారు. సోమవారం కలెక్టర్ శ్రీకాంత్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారవర్గాలు పేర్కొన్నాయి.