ఎన్నికల కోడ్ ముగిసినా 1,550 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వని ట్రిబ్
గురుకుల విద్యాసంస్థల్లో కొత్త టీచర్ల చేరికలపై వీడని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో వివిధ కేటగిరీల్లో కొత్తగా ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులు ఇంకా కొలువుదీరలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని దాదాపు నాలుగునెలలు కావొస్తున్నా, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలో 9వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి అర్హత పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) 8,600 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్(పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్(డీఎల్) కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నియామక పత్రాలు ఇచ్చేందుకు గురుకులబోర్డు చర్యలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదాపు 7,100 మందికి రెండు దఫాలుగా నియామక పత్రాలు అందజేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేయలేదు. కోడ్ ముగిసిన తర్వాత ఇవ్వాలని గురుకులబోర్డు నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు కావొస్తున్నా వీటి పంపిణీపై స్పష్టత లేదు.
పోస్టింగ్‌కు లింకు...
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గురుకుల సొసైటీలు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందుకు కారణం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రాలు అందించకపోవడమే. నియామకపత్రాలు అందించిన వారికి ముందుగా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా, సరీ్వసులో వ్యత్యాసం నెలకొంటుందనే భావన, మరోవైపు కౌన్సెలింగ్‌లో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెనక్కి తగ్గారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిస్థాయిలో నియామక పత్రా లు ఇచి్చన తర్వాత పోస్టు కేటగిరీల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ ఇచ్చేందుకు సొసైటీలు నిర్ణయించాయి. జూన్ 6వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ కోడ్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా... గురుకుల బోర్డు నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభించినా, పూర్తి చేసేందుకు కనీసం రెండువారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కనీసం వచ్చే నెల నుంచైనా కొత్త టీచర్లు విధుల్లో చేరతారో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment