ప్రభుత్వ బ్యాంకులకు మారబోతున్న అధినేతలు
న్యూఢిల్లీ : కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలు మారబోతున్నారు. అధినేతలను పునర్వ్యస్థీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం, మొండిబకాయిల సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధినేతలను మార్చుతున్నట్టు సమాచారం. పునర్ వ్యవస్థీకరించే బ్యాంకుల్లో ఐడీబీఐ కూడా ఉందట. చాలా నిశీతంగా పరిశీలించిన అనంతరం అధినేతలను మార్చే ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఐడీబీఐ బ్యాంకుకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషోర్ ఖరాట్ ను వేరే బ్యాంకుకు బదిలీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఫైనాన్సియల్ సెక్టార్లో ఎంతో మార్గదర్శకంగా నిలిచిన ఐడీబీఐ బ్యాంకు 2015-16లో రూ.3664 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ బ్యాంకుకు 2014-15లో రూ.873 కోట్ల నికర లాభాలున్నాయి.
ఈ బ్యాంకుకు క్రమేపీ లాభాలు పడిపోతున్నాయని పార్లమెంటరీ కమిటీ రిపోర్టులో తెలిసింది. స్థూల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం, రుణాల రైటాఫ్స్, సరిగా లేని ఆర్థిక ఫలితాలు ఐడీబీఐ బ్యాంకును దెబ్బతీస్తున్నాయని కమిటీ రిపోర్టు పేర్కొంది. దీంతో ఐడీబీఐ బ్యాంకుల్లో ప్రధానంగా ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సమాచారం.