‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్