ఫిబ్రవరి 4న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
ఏప్రిల్ 5 నుంచి పదో సీజన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 5 నుంచి నిర్వహించనున్నారు. అలాగే ఈ సీజన్ కోసం ఫిబ్రవరి 4న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. మంగళవారం లీగ్ పాలక మండలి సమావేశం జరిగింది. అయితే మరోసారి లోధా ప్యానెల్ సూచనలను బీసీసీఐ పక్కనబెట్టింది. ఓ అంతర్జాతీయ సిరీస్ ముగిసిన 15 రోజుల విరామం తర్వాతే ఐపీఎల్‌ను నిర్వహించాలని ప్యానెల్ పేర్కొంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ముగిసిన (మార్చి 29)న వారం రోజులకే పదో సీజన్ ప్రారంభమవుతోంది. ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో ఈసారి మ్యాచ్‌లు జరుగుతాయని లీగ్ పాలక మండలి చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఠాకూర్, షిర్కే, గంగూలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.