arabian ocean
-
దూసుకొస్తున్న‘మెకును’ పెను తుపాను..
పణాజి,గోవా : పెను తుపాను ‘మెకును’ గోవా వైపు దూసుకొస్తోంది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మస్కట్‌లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. తీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది. వీరితో పాటు వీలైనంత ఎక్కువ మంది లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను ఎవరిని సముద్ర తీరం వైపు అనుమతించడం లేదని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది. -
అరేబియా సముద్రంలో వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరో 48 గంటల్లో తుపానుగా మారనుంది. దీంతో రెండ్రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని, వాయుగుండానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో చలిగాలులు వీస్తాయన్నారు. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లా అమరాపురంలో 8 సెం.మీ., కల్యాణదుర్గం, తెనాలిలో 7, అద్దంకి, కనేకల్లలో 4, కారంచేడులో 3, ఒంగోలులో 2 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
అరేబియా సముద్రంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా ఏర్పడి క్రమంగా బలహీనపడిన ‘మాదీ’ ప్రభావమే ఇది. శుక్రవారం నాటికి వాయుగుండంగా ఉన్న ఆ వాతావరణం శనివారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి తూర్పు దిశగా వెళ్లిపోతుంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని.. కేరళలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 24 గంటల్లో ఇది బలహీనపడిపోయే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.