అర్జున్ రెస్టారెంటుకు మూత ?
న్యూఢిల్లీ: భారత పర్యాటక అభివృద్ధిశాఖ (ఐటీడీసీ) చాణక్యపురిలో నిర్వహిస్తున్న సామ్రాట్ హోటల్లో రెస్టారెంటు నిర్వహిస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు చిక్కులు వచ్చిపడ్డాయి. రెస్టారెంటు అద్దె బకాయిలు రూ.రెండు కోట్లు చెల్లించనందున, దానిని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఐటీడీసీ అర్జున్‌కు నోటీసులు పంపించింది. ఇతడు ల్యాప్ పేరుతో 2009 నుంచి సామ్రాట్ హోటల్లో రెస్టారెంటు నిర్వహిస్తున్నాడు. విద్యుత్, గ్యాస్, నీళ్ల చార్జీలకుతోడు నెలకు రూ.25 లక్షల అద్దె చెల్లించాలి. 2012 అక్టోబర్ నుంచి అద్దె చెల్లించడం మానేయడంతో ఐటీడీసీ నోటీసులు జారీ చే సింది. అయితే మొత్తం రూ. 4.5 కోట్ల బకాయిల్లో అర్జున్ ఇటీవలే రూ. 2.5 కోట్లు చెల్లించాడు. గత అక్టోబర్‌లో ల్యాప్ రెస్టారెంటు కాంట్రాక్టు గడువు ముగిసిపోగా, అర్జున్ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అద్దె బకాయిల చెల్లింపునకు కొంత గడువు ఇవ్వాలని కోరుతూ ఇతడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా నిర్ణయం వెలువడలేదు. న్యాయస్థానం నిర్ణయం వెలువరించేంత వరకు రెస్టారెంటును నడుపుకునేందుకు అర్జున్‌కు అనుమతి ఉంటుందని ఐటీడీసీ వర్గాలు తెలిపాయి.