ఆదర్శప్రాయుడు.. గంగసాని
గుండెపోటుతో మృతిచెందిన కమ్యూనిస్టు యోధుడు సత్యపాల్‌రెడ్డి
నివాళులర్పించిన సీపీఐ జాతీయ నేత నారాయణ.. రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు
జనగామ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు గంగసాని సత్యపాల్‌రెడ్డి(85) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని జనగామ బీరప్పగడ్డలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. సత్యపాల్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు జనగామకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలతో పాటు జనగామ జిల్లా కోసం జరుగుతున్న పోరాటంలో తన ప్రత్యేకత చాటుకున్నారు. రఘునాథపల్లి మండలం గబ్బెటలో 1931లో జన్మించిన సత్యపాల్‌రెడ్డి ఐదేళ్ల క్రితం జనగామలో స్థిపపడ్డారు. ఆయనకు భార్య వినోద, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అంత్యక్రియల్లో వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రజెండా సైన్యం సత్యపాల్ : నారాయణ
రాష్ట్ర వ్యాప్తంగా జనసేవాదళ్‌ను స్థాపించి 30ఏళ్లుగా శ్రమించి ఎర్రజెండా కు అండగా సైన్యాన్ని అందించిన గొప్ప నాయకుడు సత్యపాల్‌రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ కొనియాడారు. సత్యపాల్ మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో సైతం జనసేవాదళ్‌ను పటిష్టం చేసి జాతీయ నేతల ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ, ముఖ్య నాయకులకు రక్షణగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడున్న ఎర్రచొక్కా వలంటీర్లను సత్యపాలత్రెడ్డి రూపంలో చూసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు.
సత్యపాల్‌రెడ్డి గొప్ప నాయకుడు : పొన్నాల
దివంగత సత్యపాల్‌రెడ్డి గొప్ప నాయకుడని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య కొనియాడారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పిం చారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుల్లో అరుదైన నాయకుడు సత్యపాల్‌రెడ్డి అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెం కటరెడ్డి మాట్లాడుతూ తుది శ్వాస విడిచే వరకు నిజాయితీ, నమ్మకం తో పనిచేసిన సత్యపాల్‌రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. జా తీయస్థాయిలో జనసేవాదళ్కు కమాండర్‌గా పనిచేసిన ఆయన, చండ్ర రాజేశ్వర్‌రెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్, తమ్మారెడ్డి సత్యానారాయణ లాంటి గొప్పవారితో అనుబంధం పెంచుకున్నారన్నారు. మాజీఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఐజేయూ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంక ట్‌రెడ్డి, సీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సారంపల్లి వాసుదేవరెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ రంజిత్‌రెడ్డి, విజయ్ సారథి, అజయ్, సీపీఎం, సీపీఐ డివిజన్ కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, బర్ల శ్రీరాములు, బండ యాదగిరిరెడ్డి, దాసరి కళావతి, మోకు కనకారెడ్డి, శశిధర్ నివాళులర్పించారు.