చైనా, పాక్‌తో యుద్ధానికి సిద్ధమవ్వాలి
న్యూఢిల్లీ: భారత సైన్యం చైనా, పాకిస్తాన్లతో సమరానికి తప్పక సిద్ధం కావాల్సి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. భారత్‌ను దురాక్రమించేందుకు చైనా యత్నిస్తోందనీ, అటు పాకిస్తాన్‌తో రాజీ కుదిరే అవకాశమే కనిపించడం లేదని రావత్ పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. ఇటీవల డోక్లాంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఇలాంటి సమస్యలను తొందరగా ముగించొచ్చు.
లేదా చైనాతో పాటు పాకిస్తాన్‌తో కూడా కలిపి యుద్ధం చేసేంతవరకు వెళ్లాల్సిరావొచ్చు’ అని అన్నారు. ఏదేమైనా ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. దేశం బయటి నుంచి వచ్చే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాల్లో ఆర్మీకి అధిక ప్రాధాన్యతను కొనసాగించాల్సిందేనన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు మంగళవారం భేటీ అయ్యి, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.