సీఎంకు లేఖ ఎలా రాయాలో తెలీదా?
రక్షణ మంత్రి మనోహర్ పారికర్పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాయాలో కూడా తెలియదా అని ప్రశ్నించారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం పట్ల తాను ఎంతో బాధపడ్డానని ఆయన లేఖ రాయడంతో ఆమె ఈ రకంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులను వినియోగించుకోవాలన్న తన ఉద్దేశం వల్ల సైనిక దళాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని పారికర్ చెప్పడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మమత ఆరోపించారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో.. సైన్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాజకీయ కక్షలు తీర్చుకోవడం ఎప్పుడూ చూడలేదని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
కోల్కతాలోని కొన్ని ప్రాంతాలకు ఆర్మీ రావడంపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఏకంగా 36 గంటల పాటు సచివాలయంలోనే ధర్నా చేసిన విషయం తెలిసిందే. కోల్కతా నగరం నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత కూడా ఆమె అక్కడినుంచి కదల్లేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే తప్ప తాను వెళ్లబోనని పట్టుబట్టారు. అయితే అదే సమయంలో పలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సైన్యం ఉందని కేంద్ర మంత్రులు పలువురు వివరణ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తోందని అప్పట్లో ఆమె అన్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి - మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.