Art 370
-
హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ సేవలన్నీ పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పుకార్లు ప్రచారం చేస్తున్న 8 నకిలీ ఖాతాలను తొలగించాలని ట్విటర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. హోంశాఖ వెల్లడించిన జాబితాలో కశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీకే హురియత్’ నాయకుడు సయ్యద్ అలీ గిలానీ పేరుతో కూడా అకౌంట్ ఉండటం గమనార్హం. కేంద్రం తొలగించమన్న ఖాతాలు ఇవే.. 1. @kashmir787 -- వాయిస్ ఆఫ్ కశ్మీర్ 2. @Red4Kashmir -- మదిహాషకిల్ ఖాన్ 3. @arsched -- అర్షద్ షరీఫ్ 4. @mscully94 -- మేరీ స్కల్లీ 5. @sageelaniii -- సయ్యద్ అలీ గిలానీ 6. @sadaf2k19 7. @RiazKha61370907 8. RiazKha723 -
పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ బందోబస్తుకు వినియోగించుకుంటోంది. అయితే, జమ్మూకశ్మీర్ పోలీసులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయని వార్తలు బయటికొచ్చాయి. కర్ఫ్యూ పాస్ లేదని ఓ గర్భిణీని అడ్డుకోవడంతో రాష్ట్ర పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందనీ.. రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఒకరు కాల్పులు జరపడంతో ఐదురుగు జవాన్లు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాజ్ ఎస్ ఖాన్ పేరుతో ఓ పాకిస్తానీ ఈ ప్రచారానికి పూనుకున్నాడు. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసు దళం కొట్టిపారేశాయి. పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశాయి. రక్షణ దళాలేవైనా దేశం కోసం.. సుహృద్భావం వాతావరణంలో పనిచేస్తాయని చెప్పాయి. కోట్లాది భారతీయుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నీడలో తామంతా దేశ సేవకు అంకితమవుతామని.. తమ మధ్య ఎలాంటి భేదాలుండవని వెల్లడించాయి. యూనిఫారమ్‌లు వేరైనా మా లక్ష్యం దేశ రక్షణే అని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. కొందరు నకీలీ కశ్మీరీలు ఉన్నతాధికారుల పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కశ్మీర్ పోలీస్ అధికారి ఇంతియాజ్ హస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్పనలో ఉండకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు. The malicious content of this tweet is absolutely baseless and untrue. As always, all the security forces of India are working with coordination and bonhomie. Patriotism and our tricolour lie at the core of our hearts and existence, even when the color of our uniforms may differ. pic.twitter.com/1Rhrm09dPN — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) 12 August 2019 -
‘ఇక అందరి చూపు కశ్మీరీ అమ్మాయిల వైపే’
చండీగఢ్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహర్షి భగీరథ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ‘భేటీ బచావో భేటీ పఢావో’తో హరియాణాలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. -
‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’
లక్నో : ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో దేశమంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉన్న అడ్డండకులన్నీ తొలగిపోయానని, ఇప్పుడు అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని వివాహం చేసుకోవచ్చని వ్యాఖ్యానించి కతౌలి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ దుమారం రేపాడు. ఆర్టికల్ 370 రద్దు కావడంతో ముజరాఫరాబాద్‌లో బీజేపీ జిల్లా శాఖ మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సైనీ.. ‘ఆర్టికల్ 370 రద్దుతో జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు. అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. ముస్లిం యువకులే కాదు.. హిందువులందరూ, దేశ వాసులందరూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసే బ్యాచిలర్లు ఇప్పుడు దర్జాగా కశ్మీర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ప్లాట్లు, భూమి కొనుగోలు చేయొచ్చు. అందమైన యువతుల్ని వివాహం చేసుకోవచ్చు. నిబంధనల ఫలితంగా ఇంతకు ముందు అక్కడి యువతులపై అఘాయిత్యాలు జరిగేవి. ఇప్పుడు అలాంటివి ఉండవు’ అన్నారు. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కశ్మీర్ అంశంపై నరేంద్ర మోదీ సర్కార్ ఆచితూచి అడుగులేస్తున్న తరుణంలో సైనీ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. -
‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’
సాక్షి, సంగారెడ్డి : కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి కశ్మీర్ అంశంపై నెహ్రూ చేసిన పని, నేటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘పార్లమెంటు ప్రధాని మోదీ, అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూపై ఆరోపణలు చేశారు. అది సరైంది కాదు. నాడు 540 సంస్థానాలు ఉండేవి. వాటిలో హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో.. కశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేది. భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్ నిజాం నవాబు ఒప్పుకోలేదు. కానీ, ప్రజలు భారత్‌లో కలవడానికి సంసిద్ధమయ్యారు. కశ్మీర్ రాజు భారత్‌లో విలీన కావడానికి ఒప్పుకున్నాడు. కానీ, ప్రజలు ఒప్పుకోలేదు. నిజాం ఒప్పుకోకపోవడంతో పటేల్ రంగంలో దిగారు. ఆయన్ని ఒప్పించి సంస్థానాన్ని భారత్‌లో కలుపుకున్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడ్డారు. పాకిస్తాన్ నుంచి కశ్మీర్‌ను కాపాడటం కోసం నెహ్రూ ఆర్టికల్ 370, 35A తీసుకొచ్చారు. ఒకవేళ ఆ వెసులుబాటు కల్పించకపోతే మనకు ఇబ్బందుదు కలిగేవి. అప్పుడేం జరిగిందో ఇప్పుడున్న వాళ్లకు తెలియదు. ఒకవేళ పాకిస్థాన్ కశ్మీర్‌ను ఆక్రమించుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, షా కూడా అలాంటి నిర్ణయాలే తీసుకునేవాళ్లు. కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీయే. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. సీట్ల కోసం విధానాలకు భిన్నంగా ప్రవర్తించదు. బీజేపీ ఒక మతానికి చెందిన పార్టీ. ఆర్టికల్ 370, 35A ఎత్తేయాలని ఆరెస్సెస్ ముందునుంచీ అనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మోదీ, షా ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం సరైందే. అప్పుటి పరిస్థితుల తగ్గట్టు నాటి ప్రధాని నెహ్రూ చేసింది కూడా సరైందే. కశ్మీర్‌ను కాపాడటంలో నాడు నెహ్రూ కీలక పాత్ర పోషించారు. కశ్మీర్‌ను నెహ్రూ కాపాడారు కాబట్టే ఈ రోజు మోదీ, షా ఈ నిర్ణయం తీసుకోగలిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అవసరమే’అన్నారు. -
370 అధికరణపై రగడ
‘సంఘ్’తో చర్చించండి: మోడీకి దిగ్విజయ్ సలహా రాజ్యాంగం తెలియదు: ఒమర్ అబ్దుల్లా మార్చాల్సిన పనిలేదు: ముఫ్తీ మహమ్మద్ మోడీ అన్నదాంట్లో తప్పేముంది: బీజేపీ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణపై చర్చ జరగాలన్న నరేంద్రమోడీ పిలుపు రాజకీయాల్లో దుమారం సృష్టించింది. పలు ప్రధానపార్టీలతో పాటు, కాశ్మీర్ వేర్పాటువాద పార్టీలు మోడీ సూచనను తప్పుపట్టాయి.అయితే బీజేపీ మాత్రం తమ నేతను పూర్తిగా సమర్థించింది. మోడీ సూచనను అటు కాంగ్రెస్ పార్టీ,ఇటు నేషనల్ కాన్ఫరెన్స్,పీడీపీ, సీపీఎంలు తోసిపుచ్చాయి. ఆ అధికరణపై మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ మోడీకి సలహా ఇవ్వగా, మోడీకి రాజ్యాంగం తెలియదని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.కాగా మోడీ సూచనకు వక్రభాష్యం చెప్పరాదని పార్లమెంట్లో ప్రతిపక్షనేతలు సుష్మాస్వరాజ్,అరుణ్ జైట్లీలు వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై కాంగ్రెస్‌కు పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిచోట అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. చారిత్రక సంఘటనలపై మోడీవన్నీ అబద్ధాలని, వాటిని తాము సీరియస్‌గా పరిగణించడంలేదని దిగ్విజయ్ అన్నారు. అయితే, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370పై జనంలో చర్చ జరిగితే తమకు అభ్యంతరంలేదన్నారు.కాని మోడీ ముందుగా సంఘ్‌తో ఈ విషయం చర్చించాలన్నారు. కాశ్మీర్‌కు ఆ అధికరణతో ఏమైనా ప్రయోజనం ఉంటే దానిని కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని, ఆర్టికల్ 370 కారణంగా రాష్ట్ర మహిళలకు సమాన హక్కులు లేవని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోడీ ప్రకటనను కేంద్రమంత్రి మనీశ్ తివారి తిరస్కరించారు.బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని చదవరని,దానిని పట్టించుకోరని ఆయన విమర్శించారు.బీజేపీది రెండు నాల్కల ధోరణి అని ఆయన ఆరోపించారు.ఇన్నాళ్లు ఆర్టికల్ 370ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేసిన సంగతిని మనీశ్ గుర్తు చేశారు.కాగా, మోడీ చేసిన ప్రకటనను పీడీపీ,సీపీఎంలు కూడా తప్పుపట్టాయి.లేని సమస్యను మోడీ లేవనెత్తుతున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి. తమ రాష్ట్రానికి స్వతంత్ర చట్టాలున్నాయని, వాటిని కొనసాగనివ్వాల్సిందేనని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక ప్రతిపత్తి తమకు ఉండాల్సిందేనని పీడీపీ నేత ముఫ్తీమహమ్మద్ సయీద్ తెలిపారు. 370 అధికరణ అనేది మిగిలిన దేశానికి, కాశ్మీర్‌కు మధ్య వారధి లాంటిదని ఆయన అన్నారు.