ఎయిర్ ఏషియా ఇండియాకు అరుణ్ భాటియా గుడ్ బై
♦ అరుణ్ వాటాను కొంటున్న టాటా సన్స్
♦ 49%కి పెరగనున్న టాటా వాటా
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలిగారు. ఎయిర్ఏషియా ఇండియాలో అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ కంపెనీకి దాదాపు 10 శాతం వాటా ఉంది. దీంట్లో టాటా సన్స్ సంస్థ 7.94 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. మిగిలిన వాటాను ఎయిర్ ఏషియా ఇండియా చైర్మన్ రామదొరై 0.5 శాతం వాటాను, కంపెనీ డెరైక్టర్ ఆర్. వెంకటరమణన్ 1.5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు. అరుణ్ భాటియా వాటా కొనుగోలుతో టాటా సన్స్ వాటా 41.06 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. ఈ డీల్ ఈ నెల 14న జరిగిందని, వచ్చే నెలలో పూర్తవుతుందని అంచనా. కాగా మలేషియా ఎయిర్ఏషియా బెర్హాద్‌కు ఎయిర్ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉంది.
అరుణ్ భాటియా అసంతృప్తి
చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా వ్యవహారాల పట్ల అరుణ్ భాటియా గత ఏడాది డిసెంబర్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విమానయాన సంస్థపై నియంత్రణ, యాజమాన్యహక్కుల విషయంలో విభేదాల నేప థ్యంలో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలుగుతున్నారని సమాచారం. గత నెలలో ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓగా మిట్టు చాండిల్య స్థానంలో అమర్ అబ్రాల్ నియామకం జరిగింది. వచ్చే నెల 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నది. ఎయిర్ ఏషియా ఇండియా పట్ల టాటా గ్రూప్‌కు అపారమైన నమ్మకం ఉందని, అందుకే వారు వాటా పెంచుకున్నారని, ఇది గొప్ప విషయమని ఏయిర్‌ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది.ఆరు విమానాలతో 12 రూట్లలో 18 లక్షల మంది ప్రయాణికులకు విమాన సర్వీసులను అందిస్తోంది.