వర్షాలుంటే.. వేగంగా వృద్ధి
♦ ఆర్థిక బిల్లుపై సమాధానంలో అరుణ్‌జైట్లీ
♦ రాజధానికి ఇప్పటికే రూ. 2,050 కోట్లు ఇచ్చాం
♦ పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
♦ ప్రత్యేక హోదాపై ప్రస్తావించని ఆర్థిక మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడం తో ఏపీకి కష్టాలు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ఏపీకి ఏ కష్టమూ రానివ్వబోమన్నారు. కేంద్ర ఆర్థిక బిల్లుపై చర్చకు గురువారం సమాధానమిచ్చిన జైట్లీ ఏపీ విషయం మాట్లాడినప్పటికీ ప్రత్యేక హోదా విషయంపై మాటెత్తలేదు. ‘‘13వ ఆర్థిక సంఘం అవిభాజ్య రాష్ట్రానికి రూ. 98,820 కోట్ల మేర నిధులు అందాయి. అన్ని రకాల గ్రాంట్లు కలిపి ఐదేళ్లలో వచ్చిన మొత్తం ఇది. ఇందులో ఏపీకి దాదాపు 52 శాతం, తెలంగాణకు 48 శాతం నిధులందాయి. అంటే ఐదేళ్ల ముందే రాష్ట్రం విడిపోయిందనుకుందాం. అప్పుడు మొత్తం ఐదేళ్లలో ఏపీ వాటా దాదాపు రూ. 52 వేల కోట్లుగా ఉండేది. ఏపీకి రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం నిర్మించుకోవాల్సి ఉం ది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు అనేకం తెలంగాణలో ఉండిపోయినందున ఏపీకి కొత్త గా జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఇచ్చాం. వాటన్నింటినీ నేను లెక్కించడం లేదు. 13వ ఆర్థిక సంఘం ద్వారా మీకు రూ. 50 వేల కోట్లు వచ్చాయి. అంటే ఏటా సగటున రూ. 10 వేల కోట్లు వచ్చాయి. విభజన అనంతరం తొలి ఏడాది అయిన 2014-15 కూడా 13వ ఆర్థిక సంఘం పరిధిలోదే. ఈ ఏడాది ఈ మొత్తం రూ. 14,100 కోట్లుగా ఇచ్చాం..’’ అని వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రూ. 21,900 కోట్లు ఇచ్చినట్లు జైట్లీ తెలిపారు. ఇది ఏపీ హక్కు, మేం చేసిన మేలు కాదన్నారు. ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రీతిలో రెవెన్యూ మిగులు కోసం రూ. 6,609 కోట్లు ఇచ్చాం. ఎస్డీఆర్ నిధులు కూడా ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సి ఉంది.
ఇక తొలి ఏడాదికి గాను రెవెన్యూ లోటును రూ. 13,000 కోట్లుగా ఏపీ లెక్కించింది. మేం దానిని వెరిఫై చేస్తున్నాం. తుది మొత్తం ఖరారైతే ఆమేరకు చెల్లిస్తాం. ఏపీ క్లెయిం చేసుకున్న మొత్తాల్లో తక్కువగా ఇచ్చింది ఈ ఒక్క పద్దులోనే. తొలి ఏడాదిలో రెవెన్యూ లోటుకు మేం ఇప్పటివరకు రూ. 2,800 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే ఈ మొత్తం మేం ఏటా వాయిదా పద్ధతుల్లో ఇవ్వాల్సి ఉంది. రాజధానికి మేం ఇప్పటికే రూ, 2,050 కోట్లు ఇచ్చాం. నీతి ఆయోగ్ ఈ మేరకు అంచనా వేసింది. కానీ ఏపీ ఇంతకంటే కొద్దిగా ఎక్కువగా అడుగుతోంది. మేం దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకుంటాం. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాల్సి ఉంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తంగా రూ. 6,403 కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. నాబార్డు కింద కేంద్రం ఏర్పాటు చేసిన ఫండ్ ద్వారా పోలవరానికి కొంత ప్రత్యేక నిధి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
పోలవరంపై వెనక్కి వెళ్లలేం...
ఇంతలో బీజేడీ లోక్‌సభా పక్ష నేత భర్తృహరి మెహతాబ్ లేచి ‘పోలవరంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు మనం ఆగాలని మీకు అనిపించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు లేచి పోలవరం ఆపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో జైట్లీ జోక్యం చేసుకుని ‘‘అది సమస్యేమీ కాదు. ఏపీకి ఉన్న కొన్ని జిల్లాల్లో తీవ్ర కరువు నెలకొనే జిల్లాలు ఉన్నాయి. మీకు కూడా ఆ సమస్య ఉంది. రెండో సమస్య ఏంటంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ హామీ నుంచి మేం వెనక్కివెళ్లలేం.
ఒడిస్సా ఇబ్బందులను ప్రత్యేకంగా చూస్తాం’’ అని స్పష్టంచేశారు. అయితే జైట్లీ సమాధానానికి సంతృప్తి చెందని బీజేడీ ఎంపీలు నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. ‘‘ఈ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టంలో ఈ నిబంధన ఉంటే దాని నుంచి వెనక్కి వెళ్లలేం కదా. దాన్ని అమలుచేయాలి..’’ అంటూ జైట్లీ ప్రసంగం ముగించారు. అయితే ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనే లేకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు లేచి ప్రత్యేక హోదా విషయం ఏమైందంటూ ప్రశ్నించారు. అయితే ఆర్థిక మంత్రి దానిపై స్పందించకుండా ఆర్థిక బిల్లు సవరణలపైనే దృష్టిపెట్టారు.