
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా కుల రాజకీయాలు చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆయన జాతీయవాదంతోనే స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. ‘కులం పేరుతో పేదలను మోసగించే వారు విజయవంతం కాలేరు. వారు కేవలం కుల రాజకీయాల పేరిట ఆస్తులు కూడగట్టారు. బీఎస్పీ–ఆర్‌ఎల్‌డీతో పోల్చుకుంటే ప్రధాని ఆస్తులు 0.01 శాతం కూడా కాదు’ అని అన్నారు. ఈ మేరకు కనౌజ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ట్వీట్లపై జైట్లీ స్పందించారు.
‘మాయావతీ జీ, నేను చాలా వెనుకబడిన వాడిని. నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. 130 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. నన్ను విమర్శించేవారు చెప్పే దాకా దేశ ప్రజలకు నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడం కోసం వచ్చిన అవకాశంగా భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ ఆదివారం ‘నరేంద్ర మోదీజీ తనను తాను ఓబీసీకి చెందినవాడినని చెప్పుకుంటాడన్న విషయాన్ని నేను ఈ నెల 20నే చెప్పాను. అదే విషయం కనౌజ్ ఎన్నికల ర్యాలీలో మోదీ నిజం చేశారు’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment