arundalpet
-
ముగిసిన జోగి రమేశ్ విచారణ
సాక్షి, గుంటూరు: అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విచారణ ముగిసింది. ఆయనను ఉదయం నుంచి దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన పోలీసులు.. మళ్లీ 15వ తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు రావాలని అన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేశ్‌కు పోలీసులు అక్రమంగా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే తనకు నోటీసులు పంపడంపై స్పందించిన జోగి రమేశ్.. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నోటీసులతో బయపెట్టాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపైనే కుట్రలు చేస్తున్నవారు ఎంతకైనా తెగిస్తారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. కాగా, నేడు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు హాజరైన రమేశ్‌కు మద్దతుగా భారీగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని తమ నిరసన తెలిపారు. అయితే వారితో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విచారణ అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. రమేశ్‌ను 15వ తేదీన మళ్లీ విచారణకు రావాల్సిందిగా కోరినట్టు తెలిపారు. -
పోలీసుల ఓవరాక్షన్; గుంటూరులో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌పై అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతల పట్ల అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫాను అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు నెట్టివేసారు. స్టేషన్ ఎదుట మాట్లాడటానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. వైటీ నాయుడు వైఖరిపై ముస్తఫా, రావి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య అక్రమ ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు జారీ చేయడంతో జోగి రమేశ్ మంగళవారం అరండల్‌పేట పోలీసు స్టేషన్లో హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, విష్ణు, వెల్లంపల్లి కూడా ఉన్నారు. రమేశ్‌కు సంఘీభావంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేశ్.. సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న సంఘటనను చూపెట్టారు. దీనిపై వర్ల రామయ్య పోలీసులను ఆశ్రయించడంతో రమేశ్‌కు పోలీసులు అక్రమంగా నోటీసులు జారీచేసిన సంగతితెలిసిందే. కేసులు పెడతామని బెదిరింపు.. అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు జోగి రమేశ్‌ను ఉదయం 11 గంటల నుంచి అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు విచారిస్తున్నారు. రమేశ్ ముందు పోలీసులు 20 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని ఉంచారు. వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ కార్యకర్తలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడ భోజనాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు నెట్టివేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. తమ నిరసనను వీడియో తీస్తున్న పోలీసులు.. కేసులు పెడతామని బెదిరిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
గుంటూరులో పోలీసుల ఓవరాక్షన్
-
రాజీ లేని పోరు మా బాధ్యత
- టీడీపీ నేతల్లా వ్యవహరిస్తున్న అధికారులు - రైతు రుణమాఫీ దేశంలోనే అతి పెద్ద మోసం - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ - ఆస్తులు పోగేయడంలో బాబును మించుతున్న మంత్రులు: ఎమ్మెల్యే ఆర్కే గుంటూరు సిటీ : ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిన ప్రస్తుత నేపథ్యంలో ప్రజల పక్షాన రాజీ లేని పోరు చేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నిర్మించుకున్నామని, నెలాఖరులోగా అన్ని స్థాయిల కమిటీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజోపయోగ పనులు చేపట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు. అధికారులు టీడీపీ నేతల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం విలువనీయడం లేదని, సర్పంచ్ల అధికారాలను సైతం పీకేస్తున్నారని అన్నారు. నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఖాకీలను ఉసిగొల్పుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీ దేశంలోనే అతి పెద్ద మోసమని అభివర్ణించారు. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతోనే టీడీపీ గద్దెనెక్కిందన్నారు. ఈ నేపథ్యంలోనిత్యం జనంలోనే ఉంటున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూర్తి సమన్వయంతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆర్కే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వారి తీరు కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టడంలో మాత్రం వారంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబును మించిపోయే రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత గల ప్రజాపక్షంగా వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేసుకుని సమరానికి సన్నద్ధమవ్వాలని కోరారు. తాడికొండ నియోజకవర్గ నేత కత్తెర సురేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, కొత్త చిన్నపరెడ్డి, మొగిలి మధుసూదనరావు, కోవూరి సునీల్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి రాము, సంయుక్త కార్యదర్శి ఎస్.రఘురామిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, పార్టీ జిల్లా కార్యదర్శి అత్తోట జోసఫ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు శిఖా బెనర్జీ, మండేపూడి పురుషోత్తం, గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, అంగడి శ్రీనివాసరావు, యనమల ప్రకాష్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు సుద్దపల్లి నాగరాజు, జంగా జయరాజు, ఎస్స్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవరాజ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తట్టుమళ్ళ అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.