సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌పై అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతల పట్ల అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు దురుసుగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫాను అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు నెట్టివేసారు. స్టేషన్ ఎదుట మాట్లాడటానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. వైటీ నాయుడు వైఖరిపై ముస్తఫా, రావి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేత వర్ల రామయ్య అక్రమ ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు జారీ చేయడంతో జోగి రమేశ్ మంగళవారం అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, విష్ణు, వెల్లంపల్లి కూడా ఉన్నారు. రమేశ్‌కు సంఘీభావంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేశ్.. సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న సంఘటనను చూపెట్టారు. దీనిపై వర్ల రామయ్య పోలీసులను ఆశ్రయించడంతో రమేశ్‌కు పోలీసులు అక్రమంగా నోటీసులు జారీచేసిన సంగతితెలిసిందే.
కేసులు పెడతామని బెదిరింపు..
అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు జోగి రమేశ్‌ను ఉదయం 11 గంటల నుంచి అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు విచారిస్తున్నారు. రమేశ్ ముందు పోలీసులు 20 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని ఉంచారు. వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ కార్యకర్తలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడ భోజనాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు నెట్టివేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. తమ నిరసనను వీడియో తీస్తున్న పోలీసులు.. కేసులు పెడతామని బెదిరిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment