సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యోగులు సంతోషంగా స్వీకరించారని, తెగ బాధ పడుతున్నదల్లా చంద్రబాబు, ఆయన వర్గం మాత్రమేనని అన్నారు. జోగి రమేష్ మంగళవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 14.29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు సంతోషంగా ఉండాలని 23 శాతం ఇచ్చిందన్నారు. అయినా చంద్రబాబు, పచ్చ మీడియాకు ఎందుకంత ఇబ్బంది అని ప్రశ్నించారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా రెచ్చగొడుతున్నాయని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.35 లక్షల మందికి వారుండే ప్రాంతాల్లోనే ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. ఉద్యోగాలిచ్చి, గౌరవించిన దేవుడు జగన్ అని వారు గర్వంగా చెబుతున్నారని చెప్పారు. ఎన్ని డిబేట్స్ పెట్టినా, చంద్రజ్యోతి, చంద్రనాడు పేపర్లలో వార్తలు రాసినా వారు రెచ్చిపోరని, అలా అనుకొంటే అది బాబు అవివేకమేనని చెప్పారు.
ముందు హెరిటేజ్‌లో ధరలు తగ్గించండి
ముందు హెరిటేజ్‌లో ధరలు తగ్గించి, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలపై చంద్రబాబు రోడ్ల మీదకు రావాలని చెప్పారు. కేంద్రం రెండున్నరేళ్ళుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతే, రవాణా చార్జీలు పెరిగి, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. అసలు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు అండ్ కో ప్రశ్నించదని అన్నారు. పెరిగేది కొంత అయితే, చంద్రబాబు రెట్టింపు రేట్లు చెప్పారన్నారు. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు మార్కెట్‌ను విచ్ఛిన్నం చేస్తూ హెరిటేజ్, ప్రియా సంస్థల్లో వస్తువులు అధిక ధరలకు అమ్ముకుంటారని, మరోవైపు సిగ్గు లేకుండా ప్రభుత్వం మీద, సీఎం మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతి వేళ అయినా పది నిజాలు చెబితే బాబుకు నరకంలో పడే శిక్షలో పది శాతం రిబేటు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలతో సమ సమాజం కోసం సీఎం జగన్ తపన పడుతుంటే.., బాబు మాత్రం ఆయన సామాజికవర్గం కోసం ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు.
సాక్షి ఉండకూడదన్నది బాబు కోరిక
సాక్షిలో పెట్టుబడుల్ని పెట్టుబడులుగా కాకుండా, ఆదాయంగా పరిగణిస్తున్నామని గతంలో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దుర్మార్గమైన వ్యవహారం చేసిందన్నారు. అది సరికాదని ఇన్‌కంట్యాక్స్ ట్రైబ్యునల్ అభిప్రాయపడితే, దాన్ని కూడా చంద్రబాబు విమర్శించారన్నారు. ట్రైబ్యునల్ అభిప్రాయంతో చంద్రబాబుకు వంట్లో గ్యాస్ తంతోందని, ఆ గ్యాస్‌తో ఊగిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అక్కసంతా సాక్షి పత్రిక మీదనేనని, ఆ పత్రిక ఉండకూడదనే కోరిక అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment