ఈ-కామర్స్‌లోకి అరవింద్...
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్స్టైల్స్ సంస్థ అర్వింద్ ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా ఆన్లైన్ విభాగం అర్వింద్ ఇంటర్నెట్ లిమిటెడ్(ఏఐఎల్)ను ఏర్పాటు చేస్తున్నామని అర్వింద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కులిన్ లాల్‌భాయ్ మంగళవారం వెల్లడించారు. తమ గ్రూప్ ఈ-కామర్స్ కార్యకలాపాలను ఏఐఎల్ చూస్తుందని, మూడేళ్లలో రూ.1,000 కోట్లు రాబడి సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు.
తమ గ్రూప్ వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా ఈ-కామర్స్ విభాగం నిలుస్తుందని భావిస్తున్నామని వివరించారు.తమ కస్టమ్ క్లోతింగ్ బ్రాండ్, క్రేయేట్తో ఈ కామర్స్‌లోకి వస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాదికల్లా రూ.100 కోట్ల బ్రాండ్‌గా ఎదగడం లక్ష్యమని వివరించారు. రెడిమేడ్ దుస్తులకు ప్రత్యామ్నాయంగా క్రేయేట్ నిలుస్తుందని, వచ్చే ఏడాది 15 నగరాల్లో ఈ స్టోర్స్‌ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో స్టోర్స్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది క్రేయేట్ను అమెరికా మార్కెట్లోకి విస్తరిస్తామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి ఆన్లైన్ రిటైల్ సైట్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని లాల్‌భాయ్ పేర్కొన్నారు.