ఒక అసమర్థుడి మనో దర్శనం
త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ తెలుగు సాహిత్యంలో వచ్చిన మొదటి మనోవైజ్ఞానిక నవల. మానవ మనుగడలోని వైరుధ్యాలను ముఖ్యంగా హేతువుకూ, సహజ జ్ఞానానికీ; ఆదర్శానికీ, ఆచరణకూ మధ్య తలెత్తిన ఘర్షణను కళ్ళకు కట్టినట్టు చూపిన నవల ఇది. పందొమ్మిదో శతాబ్దపు చివరి భాగంలో ప్రపంచంపై రెండు సిద్ధాంతాలు ప్రగాఢమైన ప్రభావం చూపాయి. ఒకటి ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రం కాగా, మరొకటి కార్ల్ మార్క్స్ కమ్యూనిజం. ఒకటి సంక్లిష్టమైన మానవ మనస్సును విశ్లేషిస్తే, మరొకటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆర్థిక సంబంధాలను విశ్లేషించింది.
జాతీయోద్యమపు చివరిఘట్ట కాలంలో– స్వాతంత్య్ర కాలంలో వచ్చింది ‘అసమర్థుని జీవయాత్ర’. ఆనాటి తెలుగు సమాజ పల్లెటూళ్ళను, వాటి మధ్య ఉన్న మానవ సంబంధాలు, ఆస్తి అంతస్థుల అంతరాలను, జమిందారీ వ్యవస్థ బీటలు వారుతూ పెట్టుబడీదారీ వ్యవస్థ రూపుఎత్తడం వంటి సరికొత్త సందర్భానికి ఈ నవల అద్దం పట్టింది.
ఇందులో సీతారామారావు జీవితంలో ఎదురైన ప్రతి విషయాన్నీ హేతువాద దృష్టితో తీర్చుకుంటాడు. తన ప్రశ్నలకు తానే సమాధానాలను అంగీకరించక జీవితాంతం సంఘర్షణ పడుతూ చివరికి శ్మశానంలో తన గొంతు తానే పిసుక్కుని చనిపోయిన విషాదాంత జీవనయానం సీతారామారావుది. ఈ నవల రాసేటప్పుడు రచయిత గోపీచంద్ మనసులో ఉన్న సందిగ్ధ స్థితి నవలలో కనిపిస్తుంది. తండ్రి త్రిపురనేని రామస్వామి నుంచి వచ్చిన హేతువాద భావాలు, మరోవైపు మానసికంగా కలిగిన అంతరాత్మ ప్రబోధాల మధ్య ఎటువైపు వెళ్ళాలో తెలియనీయని సంఘర్షణలను నవలలో చిత్రించారు.
ఈ నేపథ్యంలోనే గోపీచంద్ అరవిందుని సమాకలనవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. అరవిందుని దర్శనం లాంటి సంక్లిష్ట తత్త్వాన్ని తాను సృష్టించిన సీతారామారావు పాత్రలో ప్రతిఫలింప జేశాడు. ఇందుకు నిదర్శనమే సీతారామారావు శ్మశానంలో తండ్రి సమాధి వద్దకు వచ్చినపుడు ‘తండ్రి తనవైపు క్రూరంగా చూస్తూ కనిపిస్తాడు’. ‘ఇదట్రా నువ్వు చేసిన పని? నీ మీద ఎంతో ఆశపెట్టుకున్నానే– చివరకు నువ్వు చేసిన పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశ ప్రతిçష్ఠనూ, కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు’– అంటూ గుడ్లు ఉరిమాడు.
అప్పటికే తనలోని ద్వంద్వాల నుండి, అహంభావ స్థితినుండి బయటపడ్డ సీతారామారావుకు తండ్రిమీద కోపం వస్తుంది. ‘నీ సంప్రదాయాలే నన్నీ స్థితికి తీసుకొచ్చాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను’ అంటూ సంభాషిస్తాడు. చనిపోయిన తల్లికూడా కనిపిస్తుంది. ‘నువ్వు మారావు నాయనా!’ అంది. ‘నేను మారానా అమ్మా!’ అన్నాడు. తల్లి సమాధి పాదాల దగ్గర పడి భోరున ఏడుస్తూ ‘మరి లాభం లేదమ్మా! ఆలస్యం అయిపోయిందమ్మా?’ అంటాడు. సీతారామారావు జీవితం చుట్టూ అలుముకున్న భ్రమల తెరలు మంచుతెరల్లా కరిగిపోయే సమయానికి జీవిత నాటకమే పూర్తి కావస్తుంది.
అసమర్థుని జీవయాత్ర నవల రచించి 75 వసంతాలు గడిచినా దాని ప్రాసంగికతను కోల్పోలేదు. కారణం– అది మనిషి అంతరంగంలో చెలరేగే ద్వైదీ భావాలయిన హేతువాదాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మన్యూనతను, అంతరాత్మ చేతనను, అచేతనలను వెలికిచెప్పిన నవలారాజం. సహజ జ్ఞానం జంతువులకు సంబంధించినది. హేతుజ్ఞానం మానవులకు సంబంధించినది. హేతుజ్ఞాని అయిన మానవుడు సుఖపడుతున్నాడా? అన్న అన్వేషణ ఈ రచన ఆసాంతం నడుస్తుంది.
మనిషి మెలకువగా ఉన్నంతసేపూ ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఆలోచన, ఆచరణ వైరుధ్యం వల్లనే మనసు ఘర్షణకు లోనవుతుంది. ఈ ఒడుదొడుకులను సరిదిద్ది మళ్ళీ ఒక క్రమం ఏర్పరచుకోవడానికి మనిషి నిద్రించే వేళ మెదడు జరిపే ప్రయత్నం కలలకు కారణం. అందువలన మనిషికి స్వప్నావస్థ చాలా అవసరమూ, ఆరోగ్యప్రదమూ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందువలన కనీసం భౌతిక అవసరాలు తీరుతుంటే కలలో కూడా చాలా మార్పులు వస్తాయి. కానీ, పెట్టుబడి ప్రధానంగా వస్తు వినిమయం ఒక అంతస్థుగా నడుస్తున్న ప్రస్తుత సమాజంలో భౌతిక ఘర్షణలు అనివార్యంగా పెరుగుతాయి. మానసిక ప్రపంచంలో కలలు ఘోరంగా ఉంటాయి. ఈ పరిస్థితిని సవరించి సమాజంలో మార్పు రావాలనే గోపీచంద్ ఆరాటం, ఆలోచన.
-డొక్కా మాణిక్యవరప్రసాద్
వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
(‘అసమర్థుని జీవయాత్ర’కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 2న విజయవాడలో చర్చా కార్యక్రమం జరగనుంది.)