'కిరణ్ పారిపోయినా చిరంజీవి ఉన్నారు'
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని అసమర్థుని జీవయాత్ర నవలతో పోల్చారు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. సీఎం కిరణ్ కాంగ్రెస్‌కు ఎందుకు రాజీనామా చేశారో తెలియదని వ్యాఖ్యానించారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టరనే అనుకుంటున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కిరణ్ పారిపోయినా చిరంజీ విలాంటి నేతలు పార్టీలో ఉన్నారని అన్నారు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రధాన కారణమని నిన్న ఆరోపించారు. విభజనకు సహకరిస్తూ సీమాంధ్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని రెండు ప్లాన్‌లు సిద్ధం చేసుకున్నారని చెప్పారు. ఏం చేసినా.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ టోపీయే పెట్టుకుని వస్తారని వెల్లడించారు.
విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే కిరణ్ రాజీనామా చేయాల్సిందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఢిల్లీలో అన్నారు. సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికే కిరణ్ ఇన్నాళ్లు పదవిలో కొనసాగారని ఆరోపించారు. కిరణ్ కొత్త పార్టీపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.