ఔరా..! రూ.500తో ఐఏఎస్‌ల వివాహం
న్యూఢిల్లీ: దేశమంతటా డబ్బు పేరిట ప్రజలు అల్లాడుతుండగానే కోట్లు పెట్టి వివాహాలు చేస్తూ అవాక్కయ్యేలా కొంతమంది చేస్తుంటే కేవలం రూ.500తో ఇద్దరు ఐఏఎస్‌లు వివాహం చేసుకొని ఔరా అనిపించారు. తమ వివాహంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజుగా చెల్లించారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌లో ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయన పెళ్లి చేసుకున్న సలోని సిదానా విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు.
దీంతో ఇటీవల తమ వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌లోని బింద్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో కోర్టు వారికి నవంబర్ 28వ తేదిని కేటాయించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులు చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని వివాహం చేసుకున్నారు. ఆశిష్ది రాజస్థాన్ కాగా సలోనిది పంజాబ్. ప్రస్తుతం వీరి వివాహం కావడంతో సలోనికి కూడా మధ్యప్రదేశ్ కేడర్‌లో పనిచేసే అవకాశం దక్కనుంది. సలోని 2013 ఐఏఎస్ పరీక్షలో టాపర్‌గా నిలిచారు.