Ashok Bhushan
-
తీర్పులే భూషణం: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: తన విశిష్టమైన తీర్పుల ద్వారా జస్టిస్ అశోక్ భూషణ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జూలై 4న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వీడ్కోలు సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. చాలామంది ప్రధాన న్యాయమూర్తులు క్లిష్టమైన కేసుల బాధ్యతను జస్టిస్ భూషణ్‌కే అప్పగించేవారని గుర్తుచేశారు. ‘‘నేను సభ్యుడిగా ఉన్న ధర్మాసనం, కమిటీల్లో జస్టిస్ భూషణ్ ఉన్నారంటే ఎంతో భరోసాగా ఉండేది. జస్టిస్ భూషణ్ ఇచ్చిన తీర్పుల్లో మానవతా విలువలు, సంక్షేమ విలువలు ప్రతిబింబిస్తాయి. జస్టిస్ భూషణ్ తన తీర్పులతోనే గుర్తుండిపోతారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తమ తీర్పు ద్వారా మార్గం సుగమం చేసిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ భూషణ్ కూడా ఉన్నారు. చట్టం రెండు వైపులా పదునున్న కత్తి చట్టం రెండువైపులా పదునున్న కత్తి లాంటిదని, న్యాయం అందించడమే కాదు, అన్యాయం జరగకుండా చూస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జస్టిస్ పీడీ దేశాయ్ 17వ స్మారకోపన్యాసంలో ఆయన ‘రూల్ ఆఫ్ లా’పై మాట్లాడారు. అప్పట్లో బ్రిటిషర్లు, భారతీయులకు వేర్వేరు చట్టాలుండేవని చెప్పారు. ‘రూల్ ఆఫ్ లా’ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల రక్షణ నిమిత్తం ‘రూల్ ఆఫ్ లా’ ఎంత మేరకు ఉపయోగిస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రాబోయే కాలానికి కర్టెన్ రైజర్‌గా భావిస్తున్నానని, ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చట్టసభలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా న్యాయవ్యవస్థను నియంత్రించలేవని స్పష్టం చేశారు. -
Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు
న్యూఢిల్లీ: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం 1992లో ఇచ్చిన మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసులో)ను పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ పరిమితిని పునఃసమీక్షించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. రిజర్వేషన్లపై పరిమితి సబబేనని పలుమార్లు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఏకగ్రీవంగా అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటాను కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లు సభ్యులుగా ఉన్నారు. మరాఠాలకు ప్రత్యేక కోటాతో 50 శాతాన్ని దాటేసి.. రిజర్వేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయనేది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్రలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్ల చట్టాన్ని చేసింది. బాంబే హైకోర్టు 2019 జూన్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే 16 శాతం కోటా సమర్థనీయం కాదని.. ఉద్యోగాల్లో 12 శాతం, విద్యాసంస్థల ప్రవేశాల్లో 13 శాతం సరిపోతుందని తేల్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సరైన భూమిక లేదు ఎంసీ గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే మరాఠాలకు ప్రత్యేక కోటాను ఇవ్వడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులేమిటో గైక్వాడ్ కమిషన్ ఎత్తిచూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటపుడు రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని అతిక్రమించడానికి సరైన భూమిక లేనట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర తెచ్చిన చట్టం సమానత్వానికి భంగకరమని తెలిపింది. అయితే ఈ చట్టం ఆధారంగా మరాఠాలకు (2020 సెప్టెంబర్‌లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించే వరకు) మెడికల్ పీజీల్లో కేటాయించిన సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపిన నియామకాలకు బుధవారం వెలువరించిన తీర్పుతో ఎలాంటి విఘాతం కలగకూడదని తెలిపింది. అంటే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు, వారి ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చెల్లుబాటు అవుతాయి. ఇకపై మాత్రం మరాఠాలకు కోటా ఉండదు. రాష్ట్రాలకు కొత్త కులాలను చేర్చే అధికారం లేదు పార్లమెంటు చేసిన 102వ రాజ్యాంగ సవరణ పర్యవసానంగా... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్తగా ఏ కులాన్నైనా చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘రాష్ట్రాలు అలాంటి కులాలను గుర్తించి కేంద్రానికి సిఫారసు మాత్రమే చేయగలవు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే ఏ కులాన్నైనా ఎస్ఈబీసీ జాబితాలో చేర్చగలరు. నోటిఫై చేయగలరు’ అని పేర్కొంది. 102వ సవరణ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ సవరణ సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొంది. కొత్త ఎస్ఈబీసీ కులాల జాబితాను నోటిఫై చేయాలని... అప్పటిదాకా పాత జాబితానే అమలులో ఉంటుందని పేర్కొంది. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338బి, 342ఏ ఆర్టికల్స్‌ను చేర్చారు. ‘338బి’లో జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం, విధులు, అధికారాలను నిర్వచించారు. ‘342ఏ’లో ఏదైనా కులాన్ని ఎస్ఈబీసీ జాబితాలో చేర్చడానికి (నోటిఫై చేయడానికి) రాష్ట్రపతికి ఉన్న అధికారాలను, ఎస్ఈబీసీ జాబితాను మార్చడానికి పార్లమెంటుకున్న అధికారాలను వివరించారు. పలు రాష్ట్రాలు పరిమితిని సడలించాలని కోరినా... రిజర్వేషన్లపై పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ ఇదివరకే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 50 శాతం పరిమితిని సడలించాలని, తమ రాష్ట్రాల్లో ఆయా సామాజికవర్గాల సంఖ్య ఆధారంగా కొన్ని కులాలకు, వర్గాలకు రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు తమకు ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించవచ్చని, మరాఠాలకు కోటా సబబేనని, రాజ్యాంగబద్ధమని కేంద్ర ప్రభుత్వం కూడా వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘మీరు సూచిస్తున్నట్లుగా 50 శాతం పరిమితి లేకపోతే సమానత్వమనే భావనకు విలువేముంది? మేమది చూడాలి. దీనిపై మీరేమంటారు? ఇలా పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పిస్తే ఫలితంగా తలెత్తే అసమానతల మాటేమిటి? రిజర్వేషన్లను ఇంకా ఎన్ని తరాలు కొనసాగిస్తారు? అని ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. మొత్తానికి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పరిమితిని విధిస్తూ 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన మండల్ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని మార్చాలంటే సమానత్వపు భావనపై నిర్మితమైన సమాజం కాకుండా... కుల పాలిత సమాజం అయ్యుండాలి. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే అది తీవ్ర విపరిమాణాలకు దారితీసే చర్యే అవుతుంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజర్వేషన్లను తగ్గించడం దుస్సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో పొందుపర్చిన సమానత్వపు హక్కును మహారాష్ట్ర చట్టం (ఎంఎస్‌ఈబీసీ యాక్ట్–2018) విస్పష్టంగా ఉల్లంఘిస్తోంది. అసాధారణ పరిస్థితులు లేకుండా 50 శాతం పరిమితిని దాటడం ఆర్టికల్ 14, ఆర్టికల్ 16ల ఉల్లంఘనే కాబట్టి రాజ్యాంగబద్ధం కాదు 102వ రాజ్యాంగ సవరణ.. తమ ప్రాదేశిక పరిధిలోని వెనుకబడిన తరగతులను గుర్తించి, వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసివేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 366 (26సి), 342ఏ చేర్చడంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను (ఎస్ఈబీసీ) గుర్తించే, నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఒక్కడికి మాత్రమే దఖలు పడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ అధికారం రాష్ట్రపతికే ఉన్నట్లుగా భావించాలి. ఎస్ఈబీసీ జాబితాలో ఏవైనా కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా... ప్రస్తుత ఉన్న వ్యవస్థల ద్వారా లేదా చట్టబద్ధమైన కమిషన్ల ద్వారా రాష్ట్రాలు ఆ మేరకు రాష్ట్రపతికి సూచనలు మాత్రమే చేయగలవు. వెనుకబడిన తరగతులను గుర్తించే, వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించిన ఆర్టికల్ 342ఏ సమాఖ్య వ్యవస్థకు భంగకరం కాదు. ప్రతికూల ప్రభావం చూపదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదు 3–2 మెజారిటీ తీర్పులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం జోక్యం చేసుకోవాలి మరాఠాల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో కలుగజేసుకోవాలి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, షాబానో వంటి కేసుల విషయంలో చూపించిన వేగాన్ని ఇందులోనూ చూపించాలి. మరాఠాల కోటాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు సహనం కోల్పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలి విద్య, ఉద్యోగాల్లో మరాఠాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయానికి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంపీ గైక్వాడ్ కమిషన్ నివేదిక విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్థంగా వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు నిర్ణయం మాకు అసంతృప్తి కలిగించింది – దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మాజీ సీఎం -
రాష్ర్టాలకు 15 రోజుల డెడ్‌లైన్ : సుప్రీం
న్యూఢిల్లీ : వలస కార్మికులను గుర్తించి వారి నైపుణ్యాలకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని మంగళవారం సుప్రీంకోర్టు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు దాదాపు కోటిమందికి పైగా వారి స్వగ్రామంలోనే పని కల్పించేందు ఓ జాబితా తయారుచేయాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వలసదారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని జులై 8లోపు అఫిడవిట్ ద్వారా కోర్టులో సమర్పించాలని రాష్ర్టాలను కోరింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు చేర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. (ఢిల్లీలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు ) వలస కూలీల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు తగినన్ని లేవని, అంతేకాకుండా సరైన వసతులు కల్పించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారని సుప్రీం స్పష్టం చేసింది. వలస కార్మికులను తరలించడానికి రైలు సదుపాయం కల్పించాలని ఏ రాష్ర్టమైనా కోరిన 24 గంటల్లోపు అందించేలా రైల్వే శాఖ బాధ్యత వహించాలని కోరింది. అవసరమైతే అదనంగా ప్రత్యేక రైళ్లు నడపాలని న్యాయస్థానం పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు వలస కూలీలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా రాష్ర్టాలను కోరింది. (కరోనా: కమ్యూనిటీ ట్రాన్స్మిషన్పై కీలక సమావేశం ) -
న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!
అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్... 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్ కౌన్సిల్లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ చంద్రచూడ్ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉపన్యాసాలిచ్చారు. జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జాన్‌పూర్‌లో జన్మించారు. అలహాబాద్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్ భూషణ్... 1979లో యూ పీ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. అలహాబాద్ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్ భూషణ్ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ నజీర్ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. -
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
మాస్టర్ రోస్టర్ సీజేఐనే: సుప్రీం
న్యూఢిల్లీ: ‘మాస్టర్ రోస్టర్’ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)నే అని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. విశేషాధికారాలతోపాటు వివిధ ధర్మాసనాలకు కేసులను కేటాయించే అధికారం సీజేఐదేనని తేల్చి చెప్పింది. కేసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంచ్.. ‘సమానుల్లో ప్రథముడు సీజేఐ, కోర్టు పరిపాలన వ్యవహారాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టే అధికారం ఆయనకు ఉంది’ అని తెలిపింది. ‘మాస్టర్ రోస్టర్‌గా సీజేఐను పేర్కొనడంలో ఎలాంటి వివాదమూ లేదు. సుప్రీంకోర్టులోని వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించే అధికారం ఆయనకు ఉంది’ అని జస్టిస్ ఏకే సిక్రీ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ భూషణ్ కూడా తన తీర్పులో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కేసులను కేటాయించడంతోపాటు వివిధ ధర్మాసనాలకు ఆ బాధ్యతలను అప్పగించే విశేషాధికారం సీజేఐకు ఉంది. సుప్రీంకోర్టు పాటిస్తున్న ప్రమాణాలు, పద్ధతులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయి. ఇప్పుడు వాటిని మార్చకూడదు. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ప్రధాన న్యాయమూర్తి. ఆయనే అధికార ప్రతినిధి, న్యాయవ్యవస్థకు నాయకుడు’ అని పేర్కొన్నారు. సీజేఐకి కేసుల కేటాయింపులో విశేషాధికారాలు ఉండరాదనీ, కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన బెంచ్‌కు అప్పగించాలని శాంతి భూషణ్ తన పిల్లో కోరారు. -
రోస్టర్ విధానంపై నేడు తీర్పు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అవలంబిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఏప్రిల్ 27నే తీర్పును రిజర్వు చేసింది. -
కేరళ గవర్నర్‌గా సదాశివం ప్రమాణ స్వీకారం
తిరువనంతపురం: కేరళ గవర్నర్‌గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు. అయితే కేరళ గవర్నర్‌గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.