న్యూఢిల్లీ : వలస కార్మికులను గుర్తించి వారి నైపుణ్యాలకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని మంగళవారం సుప్రీంకోర్టు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు దాదాపు కోటిమందికి పైగా వారి స్వగ్రామంలోనే పని కల్పించేందు ఓ జాబితా తయారుచేయాలని సూచించింది. లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వలసదారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని జులై 8లోపు అఫిడవిట్ ద్వారా కోర్టులో సమర్పించాలని రాష్ర్టాలను కోరింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు చేర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. (ఢిల్లీలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు )
వలస కూలీల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు తగినన్ని లేవని, అంతేకాకుండా సరైన వసతులు కల్పించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారని సుప్రీం స్పష్టం చేసింది. వలస కార్మికులను తరలించడానికి రైలు సదుపాయం కల్పించాలని ఏ రాష్ర్టమైనా కోరిన 24 గంటల్లోపు అందించేలా రైల్వే శాఖ బాధ్యత వహించాలని కోరింది. అవసరమైతే అదనంగా ప్రత్యేక రైళ్లు నడపాలని న్యాయస్థానం పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో లాక్‌డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు వలస కూలీలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా రాష్ర్టాలను కోరింది. (కరోనా: కమ్యూనిటీ ట్రాన్స్మిషన్పై కీలక సమావేశం )
Comments
Please login to add a commentAdd a comment