కోచి నుంచి సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు బయల్దేరిన వలసకూలీలు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని, ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలసకార్మికులను 15 రోజుల్లోగా తమ స్వస్థలాలకు పంపించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వారిలో ఆందోళనలు తొలగేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని, స్వస్థలాల్లోనే వారికి ఉపాధి కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలపై స్పందించిన కోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. తమ రాష్ట్రంలో చిక్కుకుని, సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న కార్మికులను గుర్తించి, వారిని పక్షం రోజుల్లోగా పంపించేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భౌతిక దూరం సహా లాక్‌డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి వలస కార్మికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించాలంది.
మానవత్వంతో వ్యవహరించాలి
ఉపాధి కోల్పోయి, తప్పనిసరై స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని పోలీసులు, ఇతర అధికారులకు ధర్మాసనం సూచించింది. పోలీసులు, పారా మిలటరీ దళాల దురుసు ప్రవర్తన తమ దృష్టికి వచ్చిందని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలో మరింత జాగ్రత్త
రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వలస కార్మికుల గుర్తించే కార్యక్రమం, వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియను మరింత జాగ్రత్తగా పూర్తిచేయాలని మహారాష్ట్రను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల విషయంలో మహారాష్ట్ర వ్యవహరిస్తున్న తీరులో చాలా లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. 37 వేల మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క శ్రామిక్ రైలు మాత్రమే కావాలని రైల్వేను కోరడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
ఎన్ని రైళ్లు కావాలో చెప్పండి
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు అదనంగా ఎన్ని శ్రామిక్ రైళ్లు అవసరమవుతాయో జూన్ 10వ తేదీలోగా తమకు తెలియజేయాలని రైల్వే శాఖ రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే డిమాండ్ చేసిన 171 శ్రామిక్ స్పెషల్ రైళ్లు కాకుండా, ఇంకా ఎన్ని సర్వీసులు అవసరమవుతాయో సమగ్రంగా తెలపాలంది. ప్రయాణికుల సంఖ్య, ప్రారంభ స్టేషన్, గమ్యస్థాన స్టేషన్, ఏ రోజు, ఏ సమయానికి అవసరం అనే పూర్తి వివరాలను అందించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment