న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది.
తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది.
వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు.
ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది.
మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్‌కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది.
కోవిడ్‌కు ఉచిత చికిత్స చేస్తారా?
ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్‌ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది.
ప్రైవేటులో కరోనా చికిత్స
ఖర్చుకు పరిమితి విధించండి!
ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు.
15 రోజుల్లోగా పంపేయండి
Published Sat, Jun 6 2020 4:05 AM | Last Updated on Sat, Jun 6 2020 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment