Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్‌ చెల్లదు | Supreme Court strikes down Maratha Reservation law | Sakshi
Sakshi News home page

Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్‌ చెల్లదు

Published Thu, May 6 2021 4:27 AM | Last Updated on Thu, May 6 2021 2:05 PM

Supreme Court strikes down Maratha Reservation law - Sakshi

న్యూఢిల్లీ: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం 1992లో ఇచ్చిన మండల్‌ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసులో)ను  పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ పరిమితిని పునఃసమీక్షించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది.

రిజర్వేషన్లపై పరిమితి సబబేనని పలుమార్లు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఏకగ్రీవంగా అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కోటాను కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లు సభ్యులుగా ఉన్నారు.

మరాఠాలకు ప్రత్యేక కోటాతో 50 శాతాన్ని దాటేసి.. రిజర్వేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయనేది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్రలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ)కు రిజర్వేషన్ల చట్టాన్ని చేసింది. బాంబే హైకోర్టు 2019 జూన్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే 16 శాతం కోటా సమర్థనీయం కాదని.. ఉద్యోగాల్లో 12 శాతం, విద్యాసంస్థల ప్రవేశాల్లో 13 శాతం సరిపోతుందని తేల్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది.  

సరైన భూమిక లేదు
ఎంసీ గైక్వాడ్‌ కమిషన్‌ సిఫారసుల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే మరాఠాలకు ప్రత్యేక కోటాను ఇవ్వడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులేమిటో గైక్వాడ్‌ కమిషన్‌ ఎత్తిచూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటపుడు రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని అతిక్రమించడానికి సరైన భూమిక లేనట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర తెచ్చిన చట్టం సమానత్వానికి భంగకరమని తెలిపింది.

అయితే ఈ చట్టం ఆధారంగా మరాఠాలకు (2020 సెప్టెంబర్‌లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించే వరకు) మెడికల్‌ పీజీల్లో కేటాయించిన సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపిన నియామకాలకు బుధవారం వెలువరించిన తీర్పుతో  ఎలాంటి విఘాతం కలగకూడదని తెలిపింది. అంటే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు, వారి ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చెల్లుబాటు అవుతాయి. ఇకపై మాత్రం మరాఠాలకు కోటా ఉండదు.  

రాష్ట్రాలకు కొత్త కులాలను చేర్చే అధికారం లేదు
పార్లమెంటు చేసిన 102వ రాజ్యాంగ సవరణ పర్యవసానంగా... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ) జాబితాలో కొత్తగా ఏ కులాన్నైనా చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘రాష్ట్రాలు అలాంటి కులాలను గుర్తించి కేంద్రానికి సిఫారసు మాత్రమే చేయగలవు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే ఏ కులాన్నైనా ఎస్‌ఈబీసీ జాబితాలో చేర్చగలరు. నోటిఫై చేయగలరు’ అని పేర్కొంది. 102వ సవరణ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది.

ఈ సవరణ సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొంది. కొత్త ఎస్‌ఈబీసీ కులాల జాబితాను నోటిఫై చేయాలని... అప్పటిదాకా పాత జాబితానే అమలులో ఉంటుందని పేర్కొంది. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338బి, 342ఏ ఆర్టికల్స్‌ను చేర్చారు. ‘338బి’లో జాతీయ బీసీ కమిషన్‌ నిర్మాణం, విధులు, అధికారాలను నిర్వచించారు. ‘342ఏ’లో ఏదైనా కులాన్ని ఎస్‌ఈబీసీ జాబితాలో చేర్చడానికి (నోటిఫై చేయడానికి) రాష్ట్రపతికి ఉన్న అధికారాలను, ఎస్‌ఈబీసీ జాబితాను మార్చడానికి పార్లమెంటుకున్న అధికారాలను వివరించారు.  

పలు రాష్ట్రాలు పరిమితిని సడలించాలని కోరినా...
రిజర్వేషన్లపై పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ ఇదివరకే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 50 శాతం పరిమితిని సడలించాలని, తమ రాష్ట్రాల్లో ఆయా సామాజికవర్గాల సంఖ్య ఆధారంగా కొన్ని కులాలకు, వర్గాలకు రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు తమకు ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించవచ్చని, మరాఠాలకు కోటా సబబేనని, రాజ్యాంగబద్ధమని కేంద్ర ప్రభుత్వం కూడా వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

‘మీరు సూచిస్తున్నట్లుగా 50 శాతం పరిమితి లేకపోతే సమానత్వమనే భావనకు విలువేముంది? మేమది చూడాలి. దీనిపై మీరేమంటారు? ఇలా పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పిస్తే ఫలితంగా తలెత్తే అసమానతల మాటేమిటి? రిజర్వేషన్లను ఇంకా ఎన్ని తరాలు కొనసాగిస్తారు? అని ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. మొత్తానికి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పరిమితిని విధిస్తూ 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన మండల్‌ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.   
రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని మార్చాలంటే సమానత్వపు భావనపై నిర్మితమైన సమాజం కాకుండా... కుల పాలిత సమాజం అయ్యుండాలి. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే అది తీవ్ర విపరిమాణాలకు దారితీసే చర్యే అవుతుంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజర్వేషన్లను తగ్గించడం దుస్సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14లో పొందుపర్చిన సమానత్వపు హక్కును మహారాష్ట్ర చట్టం (ఎంఎస్‌ఈబీసీ యాక్ట్‌–2018) విస్పష్టంగా ఉల్లంఘిస్తోంది. అసాధారణ పరిస్థితులు లేకుండా 50 శాతం పరిమితిని దాటడం ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 16ల ఉల్లంఘనే కాబట్టి రాజ్యాంగబద్ధం కాదు

102వ రాజ్యాంగ సవరణ.. తమ ప్రాదేశిక పరిధిలోని వెనుకబడిన తరగతులను గుర్తించి, వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసివేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 366 (26సి), 342ఏ చేర్చడంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను (ఎస్‌ఈబీసీ) గుర్తించే, నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఒక్కడికి మాత్రమే దఖలు పడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ అధికారం రాష్ట్రపతికే ఉన్నట్లుగా భావించాలి. ఎస్‌ఈబీసీ జాబితాలో ఏవైనా కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా... ప్రస్తుత ఉన్న వ్యవస్థల ద్వారా లేదా చట్టబద్ధమైన కమిషన్‌ల ద్వారా రాష్ట్రాలు ఆ మేరకు రాష్ట్రపతికి సూచనలు మాత్రమే చేయగలవు. వెనుకబడిన తరగతులను గుర్తించే, వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించిన ఆర్టికల్‌ 342ఏ సమాఖ్య వ్యవస్థకు భంగకరం కాదు. ప్రతికూల ప్రభావం చూపదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదు

3–2 మెజారిటీ తీర్పులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం  

కేంద్రం జోక్యం చేసుకోవాలి
మరాఠాల రిజర్వేషన్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో కలుగజేసుకోవాలి. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్, షాబానో వంటి కేసుల విషయంలో చూపించిన వేగాన్ని ఇందులోనూ చూపించాలి. మరాఠాల కోటాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు సహనం కోల్పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి
– ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మహారాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలి
విద్య, ఉద్యోగాల్లో మరాఠాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయానికి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంపీ గైక్వాడ్‌ కమిషన్‌ నివేదిక విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్థంగా వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు నిర్ణయం మాకు అసంతృప్తి కలిగించింది    – దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మాజీ సీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement