కుంభమేళా ఏర్పాట్లకు నిధులివ్వండి
నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి నాసిక్‌లో ఏర్పాట్లకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) ప్రతినిధులు కోరారు. మేయర్ అశోక్ ముర్తాదక్, డిప్యూటీ మేయర్ గుర్మిత్ సింగ్ బగ్గా ఆధ్వర్యంలోని ఎమ్మెన్నెస్ సభ్యులు గురువారం మాజీ మంత్రి ఛగన్ బుజ్బల్ను కలిశారు.
ఈ మేరకు శుక్రవారం మేయర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కుంభ మేళాకు ఇంకా ఎనిమిది నెలలు వ్యవధి మాత్రమే ఉందన్నారు. అయితే ఇంతవరకు నాసిక్ లో కుంభమేళా ఏర్పాట్లకు తగినన్ని నిధులు అందలేదని అన్నారు. నాసిక్‌లో కుంభమేళా ఏర్పాట్లకు రూ.2,505 కోట్ల అంచనావ్యయంతో తాము ప్రతిపాదనలు పంపితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,052 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. మొత్తం ఖర్చులో తాము కేవలం మూడోవంతు మాత్రమే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటం అన్యాయమన్నారు.
ఇప్పటివరకు ఏర్పాట్ల కోసం రూ.350 కోట్ల ఖర్చు పెట్టగా ప్రభుత్వం రూ.222 కోట్లు మాత్రమే చెల్లించందన్నారు. కాగా, ఎనిమిది నెలల వ్యవధిలో మిగిలిన పనులు పూర్తికావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందేనన్నారు. ఈ విషయమై త్వరలోనే ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు.