Ashwapuram
-
త్వరలోనే అణుశక్తి విభాగం ఆకృతి కేంద్రం
అశ్వాపురం: ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం(ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్) ఆకృతి విభాగం ఆధ్వర్యాన త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆకృతి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముంబైకు చెందిన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏపీ.తివారి, స్మితా ములె, డాక్టర్ సంజీవకుమార్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు శుక్రవారం అశ్వాపురం వచ్చారు. శాస్త్రవేత్తలు అశ్వాపురంలోని భారజల కర్మాగారాన్ని సందర్శించారు. ఆ తర్వాత భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గౌతమీనగర్ కాలనీలో ఏఈసీఎస్ స్కూల్‌ను సందర్శించిన వారు ఇక్కడి అధికారులు, స్థానికులు, రైతులతో మాట్లాడారు. భారజల కర్మాగారం పరిసరాల్లోని గ్రామాల్లో సాగవుతున్న పంటల దిగుబడి, భూముల స్వభావం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేస్తున్న నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నూతన పరికరాలు, కార్యక్రమాలను అణుశక్తి విభాగం ఆకృతి విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగారం జీఎం సతీశ్, అధికారులు పాల్గొన్నారు. -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్‌లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
దోచుకోవడానికే రీ డిజైన్
అశ్వాపురం: సాగునీటి ప్రాజెక్టులు రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటున్నారని సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను రూ.3,400 కోట్లతోనే పూర్తి చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టులకు ఇప్పుడు రీడిజైన్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మెరుగైన పరిహారం డిమాండ్ చేస్తూ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శనివారం వారు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబూరావు, ఎన్డీ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, ఆయకట్టు విస్తీర్ణం ఏమాత్రం పెరగకుండా అంచనా వ్యయం మాత్రం వేల కోట్లకు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద నాడు వైఎస్ హయాంలో 6 లక్షల ఎకరాలే సాగయిందని, ఇప్పుడు కూడా సీతమ్మ సాగర్ కింద కూడా 6 లక్షల ఎకరాలే సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. -
అశ్వాపురం, నెల్లిపాకల్లో ఏకగ్రీవాల హవా..
సాక్షి, అశ్వాపురం: ఏళ్లు కాదు..దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ సంఘాల్లో ప్రతిసారీ తీవ్ర పోటీనే. కానీ..ఈసారి ఏకగ్రీవమై ప్రత్యేకత సంతరించుకున్నాయి. అవే..అశ్వాపురం, నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. 1957లో ఏర్పాటైన ఈ రెండు సహకార సంఘాల్లో గత ఎన్నికల వరకు హోరాహోరీ పోరు ఉండేది. ఈ సారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేట్లు చూశారు. జిల్లాలోని 20 సహకార సంఘాల్లో 13కు 13 వార్డులు ఏకగ్రీవమైన సంఘాలుగా అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు నిలిచాయి. ఈ రెండు సంఘాల అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య మూడో సారి ఎన్నిక కానున్నారు. నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుక్కని మధుసూదన్ రెడ్డి ఎన్నిక కానున్నారు. గతంలో బ్రహ్మయ్య డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు ఏకగగ్రీవమయ్యేలా రాజకీయ పార్టీలను ఒప్పించి మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. 3,232 మంది సభ్యులతో ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్‌తో అశ్వాపురం పీఏసీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లిపాక పీఏసీఎస్‌కి జిల్లాలోని మొదటి మూడు సహకార సంఘాల్లో ఒకటిగా ఉంటు పలుమార్లు ఉత్తమ సంఘంగా అవార్డు పొందింది. -
లారీ, కారు ఢీ..ముగ్గురి మృతి
అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెంలో గురువారం ఘోరం జరిగింది. దంపతులు, వారి కుటుంబానికి చెందిన మరొకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన కుడిపుడి నాగేశ్వరరావు(56), ఆయన భార్య కుడిపుడి మంగలక్ష్మి(50), అమలాపురానికి చెందిన కుడిపుడి లక్ష్మి(51), కొత్తగూడేనికి చెందిన చైతన్య, రామకృష్ణ కలిసి కారులో కొత్తగూడెం బర్మా క్యాంపులో బంధువుల ఇంట కర్మకు వెళ్లారు. కారు(టీఎస్ 04 ఈఎన్ 1816)లో మణుగూరు వెళుతున్నారు. ఇంకొన్ని నిముషాల్లో గమ్యం చేరుకునేవారే. కానీ, ఇంతలోనే ఘోరం జరిగింది. మార్గమధ్యలోగల అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద మణుగూరు–కొత్తగూడెం జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి, కుడి వైపున రోడ్డుకు దూరంగా ఆగి ఉన్న లారీని ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కుడిపుడి నాగేశ్వరరావు(56), ఆయన భార్య కుడిపుడి మంగలక్ష్మి(50) అక్కడికక్కడే మృతిచెందారు. కుడిపుడి లక్ష్మి(51), భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మృతిచెందింది. కుడిపుడి ముసలయ్య, చైతన్య, రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ బి.రాంజీ పరిశీలించారు. కారులో ఇరుక్కున్న నాగేశ్వరరావు, లక్ష్మి మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను 108 సిబ్బంది భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బూర్గంపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా పర్యవేక్షణలో సీఐ అల్లం నరేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. - కొత్తగూడేనికి చెందిన రామకృష్ణ ఫొటోగ్రాఫర్. మణుగూరులో పెళ్లి ఉండడంతో ఫొటోలు తీసేందుకని ఈ కారులో బయల్దేరాడు. - మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన కుడిపుడి నాగేశ్వరరావు, మంగలక్ష్మి దంపతులు.. మణుగూరు పీవీ కాలనీలో హోటల్ నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. - కుడిపుడి లక్ష్మి(51)ది అమలాపురం. అక్కడి నుంచి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. కుడిపుడి నాగేశ్వరరావు ఇంటికి వారితో కలిసి బయల్దేరింది. - గాయపడిన వారిలో కుడిపుడి ముసలయ్యది అమలాపురం. కారు డ్రైవరైన వనచర్ల చైతన్యది కొత్తగూడెంలోని బర్మాక్యాంప్. ఫొటోగ్రాఫరైన వనచర్ల రామకృష్ణది కొత్తగూడెంలోని బర్మాక్యాంప్. -
అశ్వాపురంలో అక్కాతమ్ముడు అదృశ్యం..
ఖమ్మం(మామిళ్లవాయి): అక్కాతమ్మడు అదృశ్యమైన ఘటన ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం మండలం మామిళ్లవాయిలో ఆదివారం వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం తమ పిల్లలిద్దరూ అదృశ్యమైనట్టు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తమ పిల్లలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.