మణుగూరులోని భారజల కర్మాగారంలో ముంబైకి చెందిన బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు
అశ్వాపురం: ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం(ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్) ఆకృతి విభాగం ఆధ్వర్యాన త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆకృతి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముంబైకు చెందిన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏపీ.తివారి, స్మితా ములె, డాక్టర్ సంజీవకుమార్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు శుక్రవారం అశ్వాపురం వచ్చారు. శాస్త్రవేత్తలు అశ్వాపురంలోని భారజల కర్మాగారాన్ని సందర్శించారు.
ఆ తర్వాత భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గౌతమీనగర్ కాలనీలో ఏఈసీఎస్ స్కూల్‌ను సందర్శించిన వారు ఇక్కడి అధికారులు, స్థానికులు, రైతులతో మాట్లాడారు. భారజల కర్మాగారం పరిసరాల్లోని గ్రామాల్లో సాగవుతున్న పంటల దిగుబడి, భూముల స్వభావం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేస్తున్న నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నూతన పరికరాలు, కార్యక్రమాలను అణుశక్తి విభాగం ఆకృతి విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగారం జీఎం సతీశ్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment