లారీ, కారు ఢీ..ముగ్గురి మృతి | lorry, car collided..three dead | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ..ముగ్గురి మృతి

Published Fri, Mar 2 2018 6:36 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

lorry, car collided..three dead - Sakshi

రోదిస్తోన్న దంపతుల కుమారుడు నాగేశ్వరరావు

అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెంలో గురువారం ఘోరం జరిగింది. దంపతులు, వారి కుటుంబానికి చెందిన మరొకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన కుడిపుడి నాగేశ్వరరావు(56), ఆయన భార్య కుడిపుడి మంగలక్ష్మి(50), అమలాపురానికి చెందిన కుడిపుడి లక్ష్మి(51), కొత్తగూడేనికి చెందిన చైతన్య, రామకృష్ణ కలిసి కారులో కొత్తగూడెం బర్మా క్యాంపులో బంధువుల ఇంట కర్మకు వెళ్లారు. కారు(టీఎస్‌ 04 ఈఎన్‌ 1816)లో మణుగూరు వెళుతున్నారు.

ఇంకొన్ని నిముషాల్లో గమ్యం చేరుకునేవారే. కానీ, ఇంతలోనే ఘోరం జరిగింది. మార్గమధ్యలోగల అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద మణుగూరు–కొత్తగూడెం జాతీయ రహదారిపై వీరి కారు అదుపు తప్పి, కుడి వైపున రోడ్డుకు దూరంగా ఆగి ఉన్న లారీని ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కుడిపుడి నాగేశ్వరరావు(56), ఆయన భార్య కుడిపుడి మంగలక్ష్మి(50) అక్కడికక్కడే మృతిచెందారు. కుడిపుడి లక్ష్మి(51), భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మృతిచెందింది. కుడిపుడి ముసలయ్య, చైతన్య, రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద స్థలాన్ని సీఐ అల్లం నరేందర్, ఎస్‌ఐ బి.రాంజీ పరిశీలించారు. కారులో ఇరుక్కున్న నాగేశ్వరరావు, లక్ష్మి మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను 108 సిబ్బంది భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బూర్గంపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబా పర్యవేక్షణలో సీఐ అల్లం నరేందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

-  కొత్తగూడేనికి చెందిన రామకృష్ణ ఫొటోగ్రాఫర్‌. మణుగూరులో పెళ్లి ఉండడంతో ఫొటోలు తీసేందుకని ఈ కారులో బయల్దేరాడు.  
-   మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన కుడిపుడి నాగేశ్వరరావు, మంగలక్ష్మి దంపతులు.. మణుగూరు పీవీ కాలనీలో హోటల్‌ నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  
-   కుడిపుడి లక్ష్మి(51)ది అమలాపురం. అక్కడి నుంచి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. కుడిపుడి నాగేశ్వరరావు ఇంటికి వారితో కలిసి బయల్దేరింది. 
-   గాయపడిన వారిలో కుడిపుడి ముసలయ్యది అమలాపురం. కారు డ్రైవరైన వనచర్ల చైతన్యది కొత్తగూడెంలోని బర్మాక్యాంప్‌. ఫొటోగ్రాఫరైన వనచర్ల రామకృష్ణది కొత్తగూడెంలోని బర్మాక్యాంప్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement