దోచుకోవడానికే రీ డిజైన్‌ | Left parties angry over Telangana government | Sakshi
Sakshi News home page

దోచుకోవడానికే రీ డిజైన్‌

Published Sun, Jul 18 2021 2:09 AM | Last Updated on Sun, Jul 18 2021 2:09 AM

Left parties angry over Telangana government - Sakshi

అశ్వాపురంలో మాట్లాడుతున్న సాంబశివరావు

అశ్వాపురం: సాగునీటి ప్రాజెక్టులు రీడిజైన్‌ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాలకులు దోచుకుంటున్నారని సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టులను రూ.3,400 కోట్లతోనే పూర్తి చేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టులకు ఇప్పుడు రీడిజైన్‌ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు.

మెరుగైన పరిహారం డిమాండ్‌ చేస్తూ సీతమ్మసాగర్‌ ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శనివారం వారు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబూరావు, ఎన్డీ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, ఆయకట్టు విస్తీర్ణం ఏమాత్రం పెరగకుండా అంచనా వ్యయం మాత్రం వేల కోట్లకు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల కింద నాడు వైఎస్‌ హయాంలో 6 లక్షల ఎకరాలే సాగయిందని, ఇప్పుడు కూడా సీతమ్మ సాగర్‌ కింద కూడా 6 లక్షల ఎకరాలే సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement