నీరు, నేల సాక్షిగా.. స్వాహా పర్వం | YS Jagan Mohan Reddy Navaratnalu Scheme About Jalayagnam | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 8:56 AM | Last Updated on Sat, Jan 5 2019 9:09 AM

YS Jagan Mohan Reddy Navaratnalu Scheme About Jalayagnam - Sakshi

సీఎం చంద్రబాబు తొలుత విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించిన మేరకు చూస్తే.. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తయుండాలి. రాష్ట్రం సస్యశ్యామలమై ఉండాలి.. కానీ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రూ.20 వేల కోట్లు, నీరు–చెట్టు కింద రూ.పది వేల కోట్లు, చెరువులు, వాగులు, వంకల్లో పూడిక తీసిన మట్టి, ఇసుక అమ్మకం ద్వారా రూ.25 వేల కోట్లు.. వెరసి రూ.55 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  

ఎవరైనా ఇంటికి పునాదులు వేసి.. గృహ ప్రవేశానికి రండంటూ అందరినీ పిలిచి భోజనం పెడితే ఏమంటాం? పిచ్చోడంటాం.. లేదా మనందరినీ తప్పుదోవ పట్టించడానికి చెవిలో పూలు పెడుతున్నాడంటాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సరిగ్గా ఇదిగో ఇలానే చేస్తున్నారు.   – వైఎస్‌ జగన్‌  

బాబు పుణ్యమా అని మా బతుకులిలా తగలడ్డాయి..


మాది నిరుపేద కుటుంబం. రెండెకరాల చిన్న రైతును. నాలుగేళ్లుగా చినుకు లేదు. పంటలు పండే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు పడ్డ కొద్దిపాటి వర్షానికి కంది, మిరప, పత్తి లాంటి పైర్లు వేసినా ఆ తర్వాత వర్షాల్లేక ఎండిపోవడం మామూలైంది. పంటలు వేయడమే మానుకున్నాం. సేద్యాన్ని పక్కన పెట్టాం. కడుపు నిండాలంటే రెక్కల కష్టం తప్పలేదు. ఇక్కడ పనుల్లేకపోవడంతో వలస వెళ్లక తప్పలేదు. వరి కోతలకు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు.. చెరకు నరకడానికి శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు పోతున్నాం.

ఒంట్లో సత్తా ఉన్నన్నాళ్లు నేను వెళ్లే వాడిని. ఇప్పుడు కష్టంగా ఉంది. మా పిల్లలు వెళుతున్నారు. నెల కిందట తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో వరి కోతలకు వెళ్లి.. ఆదివారం తిరిగొస్తుండగా లారీ ప్రమాదంలో మా పిల్లలకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. అలా జరగకుండా ఉన్నట్లయితే గుంటూరు జిల్లాలో వరి కోతలకు వెళ్లేవారు. ఏడేళ్లుగా వలసపోతూనే ఉన్నాం. ఏడాదిలో మూడు నెలలే కూలి ఉంటుంది. దాంతోనే కుటుంబం మొత్తం బతకాల్సి వస్తోంది. బతుకు దుర్భరంగా ఉంది.

వెలిగొండ ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కారు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టు రైతులమైన మా బతుకు భారమైంది. పొలాలన్నీ బీళ్లే. తిండి గింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి లేదు. ప్రాణప్రదంగా పెంచుకున్న పశువులను కబేళాలకు తరలించి రైతులందరం ఇతర ప్రాంతాలకు కూలికెళ్లి బతుకీడుస్తున్నాం. మా బతుకులిలా తగలడ్డాయి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ పనులు వేగంగా జరిగాయి. అప్పుడే పనులు పూర్తయి నీరొచ్చి మా బతుకులు మారతాయన్న ఆశ చిగురించింది. ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ పనులను పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది.  
నార్లగడ్డ సుబ్బయ్య, వెంకటరెడ్డి పల్లె, పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా

ఆయ‘కట్టు’కథలు.. కమీషన్ల పర్వాలు
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయి వరుస ఓటములతో కుంగి కుదేలైన టీడీపీని అధికారంలోకి తేవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల జపం చేసి, అధికారంలోకొచ్చాక తన అక్రమార్జనకు వాటిని వనరులుగా మార్చుకున్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మినహా మిగతా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తానంటూ సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ.. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657.62 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.10,227.92 కోట్లు, నీరు–చెట్టు కింద చేసిన పనులకు రూ.15,806.70 కోట్లు ఖర్చు చేశారు.

అంటే.. మిగతా రూ.37,623 కోట్లను పెండింగ్‌ ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేశామని చెబుతున్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తయింది లేదు. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన రూ.63,657.62 కోట్లను సక్రమంగా వినియోగించుకుని ఉండుంటే.. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తయ్యేవని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జల సంరక్షణ, భూగర్భ జల వనరుల పరిరక్షణ ముసుగులో నీరు–చెట్టు కింద పనులు చేయకుండానే చేసినట్లు చూపి దోపిడీ చేయకుండా ఆ నిధులను పోలవరం ప్రాజెక్టుకు మళ్లించి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చేవని జల వనరులశాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. కమీషన్‌ల వర్షం కురిపించే కామధేనువులుగా సాగునీటి ప్రాజెక్టులను మార్చేయడం వల్ల ఈ దుస్థితి నెలకొంది.  

జలయజ్ఞం కింద దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన గుండ్లకమ్మ, పుష్కర, తాడిపూడి, గురురాఘవేంద్ర, భూపతిపాలెం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, తోటపల్లి తదితర 11 ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులు పూర్తి చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ 11 ప్రాజెక్టులను కేవలం రూ.780 కోట్లతో పూర్తి చేయవచ్చని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనుల్లో పెద్దగా కమీషన్‌లు రావనే నెపంతో ఆ పనులకు టీడీపీ సర్కార్‌ ప్రాధాన్యమివ్వలేదు.

గాలేరు–నగరి తొలి దశ, హంద్రీ–నీవా తొలి దశ, తెలుగుగంగ ప్రాజెక్టులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. దీనివల్ల 6.45 లక్షల ఎకరాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది.

ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేది. కానీ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన సర్కారు.. పాత కాంట్రాక్టర్లను తొలగించి, కమీషన్లు ఇచ్చిన వారికి పనులు అప్పగించింది. అయినా ఆ పనులను పూర్తి చేయలేకపోయింది. దాంతో నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో.. ఎప్పుడో పూర్తయి, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు మళ్లీ ప్రారంభించి.. అది తన ఘనతగా చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుండటంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వరకూ ఇదే కథ.

రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 199.04 లక్షల ఎకరాలుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోరు బావుల కింద 104.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ నాలుగున్నరేళ్లుగా ఆయకట్టు తగ్గిపోతూ వస్తోంది. గరిష్టంగా 76 లక్షల ఎకరాలకే సాగునీరు అందించినట్లు జల వనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. కానీ.. క్షేత్ర స్థాయిలో ఆ మేరకు కూడా సాగునీళ్లు అందిన దాఖలాల్లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

పొలం వదిలేసి.. డ్రైవర్‌గా వెళ్తున్నా...


నాకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తెకు పెళ్లి చేశా. మరో కుమార్తె ఇంటర్, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాకు నాలుగెకరాల మామిడి తోట ఉంది. మూడేళ్లుగా కాపు తగ్గుతూ వస్తోంది. బోరు బావి తవ్వాలంటే రూ.80 వేలవుతోంది. అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. పోనీ అప్పు తెద్దామన్నా ఆర్థికంగా చితికిపోయిన నాకు ఎవరిస్తారు? అప్పు దొరికే పరిస్థితి లేదు. తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి. కష్టాలన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఒకప్పుడు ఎంతో మంది కూలీలకు పని కల్పించిన నేను.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్‌ను కూడా అమ్మేశాను. పండ్ల ఫ్యాక్టరీలో ప్యాకింగ్‌ కూలీగా పని చేసేందుకు మహారాష్ట్రకు కూలీగా వెళ్లాను. అక్కడ భాష రాక బతుకు భారమై మళ్లీ ఇంటికొచ్చాను. పొట్టకూటి కోసం ఇక్కడే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నా. చంద్రబాబు సర్కారు అన్నదాతలను ఆదుకోదని తేలిపోయింది. నా గోడు వినేవారు లేరు. వైఎస్‌ జగన్‌ వస్తేనే మళ్లీ నాకు మునుపటి బతుకు వస్తుంది. ఆయనే ఉచితంగా బోరు వేయిస్తానన్నారు. పెట్టుబడికి డబ్బులు కూడా ఇస్తానన్నారు. ముఖ్యంగా మా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. మా పొలాలకు నీరొస్తుంది.       
– అమ్మనబ్రోలు నాగయ్య, కొల్లూరుపాడు, ఉలవపాడు పంచాయతీ, ప్రకాశం జిల్లా.

చంద్రబాబు ఇలా చెప్పారు..

  • చంద్రబాబు 2014 ఎన్నికప్పుడు.. అధికారంలోకి వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తి చేస్తాం.
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తాం.
  • పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ఆయకట్టుకు నీళ్లందిస్తాం.  
  • నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తాం.
  • సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మళ్లించి రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం.

చంద్రబాబు చేసిందిదీ..: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో రూ.37,952.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మాత్రం రూ.96,060.73 కోట్లకు పెంచేశారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.58,107.86 కోట్లు పెంచేశారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నారనేది స్పష్టమవుతోంది.  

విభజన చట్టం ప్రకారం కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నారు. ఆ తర్వాత పనులన్నీ నామినేషన్‌పై కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయక ముందే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కర్ణాటక సర్కార్‌ చర్యలు తీసుకుంటున్నా, ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో అదనపు నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనే కాదు.. గోదావరి జలాలపై రైతుల హక్కుల పరిరక్షణలోనూ అదే కథ. చివరకు వంశధార జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను కూడా పరిరక్షించలేకపోయారు.

అపర భగీరథుడు వైఎస్సార్‌


ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా, దేశ ధాన్యాగారం (రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా ప్రసిద్ధికెక్కింది. కానీ 1995 నుంచి 2004 వరకు వరుస కరవులతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతులు ఆకలితో అలమటించారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను మళ్లించి.. బంజరు భూములను సస్యశ్యామలం చేసి, కరవును శాశ్వతంగా తరిమికొట్టేందుకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. తె

లుగునేలను కరువనేదే ఎరుగని సీమగా మార్చాలని, దేశ ధాన్యాగారంగా నిలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ నామధేయాన్ని సార్థకం చేసి.. రైతేరాజు అన్న నానుడిని నిజం చేసే దిశగా వేగంగా అడుగులేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా, 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయడం ద్వారా 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్‌.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమరుడయ్యారు.

మహానేత స్ఫూర్తి.. అదే ఆర్తి..


తెలుగునేలను సుభిక్షం చేయడానికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని చేపడితే.. దాన్ని పూర్తి చేసి, ఫలాలను రైతులకు అందించే గురుతర బాధ్యతను ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. ఆయన ప్రకటించిన నవరత్నాలలో జలయజ్ఞానికి పెద్దపీట వేశారు. మహానేత చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసే సమర్థత.. ప్రణాళిక ఒక్క వైఎస్‌ జగన్‌కే ఉన్నాయని సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, రైతులు స్పష్టీకరిస్తున్నారు.

  • అధికారంలోకి వచ్చిన తక్షణమే జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను సమీక్షించి.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తాం.  
  • పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కడలి పాలవుతున్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను దేశపు ధాన్యాగారంగా తీర్చిదిద్దుతాం.  
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తాం. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం.
  • వంశధార, తోటపల్లి, జంజావతి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తిచేసి ఉత్తరాంధ్రను సుభిక్షం చేస్తాం.
  • హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, గుండ్లకమ్మ, సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం.
  • కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించి, నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీళ్లందించేలా చూస్తాం.
  • నిర్వాసితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement