సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన గురువారం సభలో మాట్లాడుతూ.. ’ఎవరు చేత ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ఆ భగవంతుడు సంకల్పిస్తాడో వాళ్లే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస‍్సార్‌కే ఉన్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా ఆయన తనయుడు వైఎస్ జగనే.
పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్సార్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దోచేశారు. గత అయిదేళ్లలో పొరుగు రాష్ట్రంతో అనేక విబేధాలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తుంటే... దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై కమిటీ వేశాం. నివేదిక ఆధారంగా రివర్స్ ట్రెండింగ్‌కు వెళతాం. అన్నీ తీస్తాం. మా పాలనకు కేవలం 40 రోజులే అయింది. సినిమా ఇంకా చాలా ఉంది. మా ప్రభుత్వం ప్రాజెక్టులు ఆపేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత సర్కార్ చేయని పనులను కూడా చేసినట్లు మీడియా ప్రచారం కోసమే పాకులాడింది. మేమలా కాదు చెప్పిన పనులన్నీ పారదర్శకంగా చేసి చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో 23 సంఖ్యను తగ్గించుకోకుండా ఉండండి’ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment