ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ విచారణ
పాలకొల్లు అర్బన్ : స్థానిక ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ డాక్టర్ కె.ప్రమీల(రాజమండ్రి), మహిళా సాధికారత సంస్థ అకడమిక్ అధికారులు రోజ్‌లాండ్, ఎస్.మాధవి మంగళవారం విచారణ నిర్వహించారు. కళాశాలలో పారిశుధ్యలోపం, అధ్యాపకుల్లో భేదాభిప్రాయాలపై మహిళా సాధికారిత సంస్థకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం అధికారులు కళాశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ హాజరుకాకపోవడంతో అధికారులు కళాశాల పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్యంలోపం ఉన్నట్టు గుర్తించారు. హాజరుశాతాన్ని పరిశీలించి కొన్ని తరగతుల్లో అటెండెన్స్ తీసుకోలేదని గమనించారు. అధ్యాపకులను మందలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, అధ్యాపకులతోనూ, కళాశాల పాలకవర్గ సభ్యులు సమావేశాలు నిర్వహించి కళాశాల ప్రగతిని సమీక్షించాలని సూచించారు. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛభారత్ విధిగా పాటించాలని చెప్పారు. ప్రతి తరగతి గది ముందు చెత్తబుట్టను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కి సూచించారు. అనంతరం కళాశాలలో లైంగిక వేధింపుల విషయమై విద్యార్థులను విచారించారు. అధ్యాపకుల వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌కి పాల్పడితే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ ఎం.సాగర్‌ప్రకాశం, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ సాయిబాబా కళాశాల ప్రగతిని వివరిస్తూ అధ్యాపకులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ కొరత, ఆర్థికపరమైన ఇబ్బందులను ఆర్జేడీ డాక్టర్ ప్రమీల దృష్టికి తీసుకువెళ్లారు.