aspari
-
సంస్కారం నేర్పబడును
ఇక్కడ డ్రైవింగ్ నేర్పబడును.. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వబడును.. కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కు ఉచిత కోచింగ్.. ఇలాంటి ప్రకటనలు తరచూ చూస్తుంటాం.. కానీ సంస్కారం నేర్పబడును.. అని ఎక్కడా కనిపించడం కాదు కదా.. వినిపించి కూడా ఉండదు. ప్రతి ఒక్కరికీ చదువు - సంస్కారం ఎంతో అవసరమనేది తెలిసిందే. ప్రస్తుతం ర్యాంకులు, గ్రేడ్‌లంటూ విద్యా సంస్థలు బట్టీ చదువులకే ప్రాధాన్యత ఇస్తున్నాయే కాని.. సభ్యత, సంస్కారం నేర్పడం ఎప్పుడో మరిచిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఒక్క మొక్క కూడా నాటకుండానే చుట్టూ పచ్చదనం కోరుకోవడం ఎంత తప్పో.. పిల్లలకు సంస్కారం నేర్పకుండా వారి నుంచి గౌరవ, మర్యాదలు ఆశించడం కూడా అంతే తప్పు అంటారు మన వీర బలవంతప్ప. అందుకే ఆయన సంస్కారం నేర్పబడును అంటూ ముందుకొచ్చారు. నేడు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూల్ : పెద్ద పెద్ద చదువులు అభ్యసించి, ఉన్నత స్థానంలో విధులు నిర్వర్తిస్తున్నా.. సభ్యత, సంస్కారం లేకపోతే ప్రయోజనం లేదంటారు పెద్దలు. పెద్దలను గౌరవించడం, సంప్రదాయాలకు విలువ ఇస్తేనే సమాజం బాగుపడుతుందనేది అక్షర సత్యం. నేటి సమాజంలో కొంత మంది యువతలో సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు లేవని పెద్దలు బాధపడుతున్నారు. రోజు రోజుకు సంస్కారం, సంప్రదాయాలు పాటించే వారు తగ్గిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు కాని నేర్పిద్దామని ఆలోచించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్పరి మండలంలో ముత్తుకూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అటు వైపు ఒక అడుగు వేశారు. విద్యార్థులకు సభ్యత – సంస్కారం నేర్పించేందుకు నడుం బిగించారు. ఈ మేరకు సొంతంగా రూ.6 లక్షలు ఖర్చు పెట్టి ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రంలో సంస్కార శిక్షణ కేంద్రం నిర్మించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల సెలవు రోజుల్లో సంస్కారంపై శిక్షణ ఇవ్వడంతో పాటు, భగవద్గీత, యోగాసనాలు, ఇతిహస పురాణాలు, నీతి, భక్తి శతకాల పద్యాలు నేర్పేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరు ఎటు పోతే నాకేందుకు అనుకునే వారెందరో ఉన్న ఈ రోజుల్లో భవిష్యత్ తరాలు వారికి మంచి నేర్పేందుకు వీర బలవంతంప్ప ముందుకు రావడం హర్షనీయమని స్థానికులు కొని యాడుతున్నారు. సంస్కార శిక్షణ కేంద్రం ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వీర బలవంతప్ప రచించిన శ్రీమానవ శతకం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. భవిష్యత్ తరాలకు మంచిని నేర్పాలి సభ్యత, సంస్కారం, సంప్రదాయాల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశా. నా వంతుగా కొంత మందికైనా మంచి విషయాలు తెలపాలనే ప్రయత్నం ఇది. చిన్నప్పటి నుంచి పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు ఇలాంటివి నేర్పించాలి. అప్పుడే యువత చెడు మార్గం పట్టదు. సంస్కారంతో పాటు ఆరోగ్యం బాగుండాలంటే యోగాసనాలు వేయాలి. ఇతిహస పురాణాలు తెలుసుకోవాలి. అందరూ భక్తి మార్గంలో నడవాలన్నదే నా ధ్యేయం. – వీర బలవంతప్ప, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు -
భర్త వేధింపులు తాళలేక
ఆస్పరి : మండల కేంద్రంలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణం పొందింది. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాల మేరకు..మండల కేంద్రానికి చెందిన మహానందికి ఆదోని మండలం బసరకోడుకు చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన ఆరు నెలల పాటు వీరి సంసారం సాఫీ జరిగింది. ఆతర్వాత అతడు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపారు. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. ఈక్రమంలో గుడిసె పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు భర్త, అత్త చిట్టెమ్మ, మరిది రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మాకు కూడా ఆత్మహత్యలే గతి!
కర్నూలు : బంగారం వేలంపాటలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌పై బ్యాంక్ అధికారులు స్పందించారు. కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్బీఐ బ్యాంకు వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బ్యాంక్ అధికారులు బంగారు ఆభరణాల వేలాన్ని నిలిపివేయాలంటూ రైతులు బ్యాంక్‌ను ముట్టడించి నిరసనకు దిగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కూన రవి మాట్లాడుతూ రైతులు రుణాలు కట్టకపోవటంతో తమపైనా ఒతంతిళ్లు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. తప్పని పరిస్థితుల్లో బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. రుణమాఫీ హామీ ఉంటుందన్న ఆశతో రైతులు ఎవరూ తాము తీసుకున్న రుణాలు తిరిగి కట్టకపోవటంతో తాము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. -
భర్తను ప్రియుడితో హత్యచేయించిన భార్య: శవం వెలికితీత
కర్నూలు: ఓ యువతి ప్రియుడి మోజులోపడి భర్తనే హత్య చేయించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో హతుడి బంధువులు ఆందోళన చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి తన ప్రియుడైన భావతో హత్య చేయించినట్లు తెలిసింది. పాతిపెట్టిన శవాన్ని ఈరోజు పోలీసులు వెలికితీశారు. శవపరీక్షకు తరలించారు. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం ఆస్పరికి చెందిన గిట్టప్పగారి రామాంజనేయులు, సుంకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన మునిరాజు(23)కు మూడేళ్ల క్రితం పత్తికొండకు చెందిన రామాంజనేయులు, పార్వతమ్మ దంపతుల చిన్నకుమార్తె భారతితో వివాహమైంది. ఆ తర్వాత ఏడాదికే వీరు స్థానికంగానే వేరుకాపురం పెట్టి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. భారతి అక్క తిరుపతమ్మ ఆస్పరి సమీపంలోని మొలగవళ్లిలో ఉంటోంది. ఈమె భర్త వేమన్న అప్పుడప్పుడు ఆస్పరిలోని మరదలు భారతి ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చివరకు వీరిద్దరూ మునిరాజును వదిలించుకోవాలని నిర్ణయించుకొని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9న ఆస్పరి చౌరస్తాలో ఉన్న తన బావను ఇంటికి తీసుకురమ్మని భారతి తన భర్తను బయటకు పంపింది. అలా వెళ్లిన మునిరాజు తిరిగిరాలేదు. ఈ విషయమై అతని తల్లిదండ్రులు 12న ఆస్పరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా వారు నమోదు చేశారు. భార్యపైనే అనుమానం ఉందంటూ మునిరాజు బంధువులు తీవ్ర ఒత్తిడి చేయడంతో నాలుగు రోజుల క్రితం ఆమె బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మునిరాజును ఆదోని సమీపంలోని సాదాపురం బస్టాండ్ వద్ద హత్య చేసి పూడ్చిపెట్టినట్లు వెల్లడించాడు. ఆ తరువాత భారతిని కూడా పోలీసులు అదుపులోకి తీసున్నారు. అయితే పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచడంతో అతని బంధువులు సోమవారం ఉదయం ఆస్పరి పోలీసుస్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. అంతకు ముందు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. చివరకు పోలీసులు శవం పూడ్చిపెట్టినట్లుగా భావిస్తున్న సాదాపురం ప్రాంతానికి వెళ్లినా ఫోరెన్సిక్ వైద్యుడు రాలేదంటూ వెనుతిరిగారు. ఆగ్రహించిన మునిరాజు బంధువులు మరోసారి సాదాపురం బస్టాండ్ వద్ద పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. డిఎస్పి చెప్పిన ప్రకారం పాతిపెట్టిన శవాన్ని ఈరోజు వెలికితీశారు.