భర్తను ప్రియుడితో హత్యచేయించిన భార్య: శవం వెలికితీత
కర్నూలు: ఓ యువతి ప్రియుడి మోజులోపడి భర్తనే హత్య చేయించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో హతుడి బంధువులు ఆందోళన చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి తన ప్రియుడైన భావతో హత్య చేయించినట్లు తెలిసింది. పాతిపెట్టిన శవాన్ని ఈరోజు పోలీసులు వెలికితీశారు. శవపరీక్షకు తరలించారు.
పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం ఆస్పరికి చెందిన గిట్టప్పగారి రామాంజనేయులు, సుంకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడైన మునిరాజు(23)కు మూడేళ్ల క్రితం పత్తికొండకు చెందిన రామాంజనేయులు, పార్వతమ్మ దంపతుల చిన్నకుమార్తె భారతితో వివాహమైంది. ఆ తర్వాత ఏడాదికే వీరు స్థానికంగానే వేరుకాపురం పెట్టి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. భారతి అక్క తిరుపతమ్మ ఆస్పరి సమీపంలోని మొలగవళ్లిలో ఉంటోంది.
ఈమె భర్త వేమన్న అప్పుడప్పుడు ఆస్పరిలోని మరదలు భారతి ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చివరకు వీరిద్దరూ మునిరాజును వదిలించుకోవాలని నిర్ణయించుకొని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9న ఆస్పరి చౌరస్తాలో ఉన్న తన బావను ఇంటికి తీసుకురమ్మని భారతి తన భర్తను బయటకు పంపింది. అలా వెళ్లిన మునిరాజు తిరిగిరాలేదు. ఈ విషయమై అతని తల్లిదండ్రులు 12న ఆస్పరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా వారు నమోదు చేశారు.
భార్యపైనే అనుమానం ఉందంటూ మునిరాజు బంధువులు తీవ్ర ఒత్తిడి చేయడంతో నాలుగు రోజుల క్రితం ఆమె బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మునిరాజును ఆదోని సమీపంలోని సాదాపురం బస్టాండ్ వద్ద హత్య చేసి పూడ్చిపెట్టినట్లు వెల్లడించాడు. ఆ తరువాత భారతిని కూడా పోలీసులు అదుపులోకి తీసున్నారు. అయితే పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచడంతో అతని బంధువులు సోమవారం ఉదయం ఆస్పరి పోలీసుస్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. అంతకు ముందు స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
చివరకు పోలీసులు శవం పూడ్చిపెట్టినట్లుగా భావిస్తున్న సాదాపురం ప్రాంతానికి వెళ్లినా ఫోరెన్సిక్ వైద్యుడు రాలేదంటూ వెనుతిరిగారు. ఆగ్రహించిన మునిరాజు బంధువులు మరోసారి సాదాపురం బస్టాండ్ వద్ద పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. డిఎస్పి చెప్పిన ప్రకారం పాతిపెట్టిన శవాన్ని ఈరోజు వెలికితీశారు.