Aspari Mandal
-
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆస్పరి: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి మండలం చిన్నహోతూరు వద్ద టిప్పర్ బోల్తాపడి ఆరుగురు మహిళలు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల కోసం నల్లగొండకు వెళ్లి హోళగొందకు టిప్పర్‌లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హోళగొంద మండలం కొత్తపేట వాసులు. వీరిని షేకమ్మ, హన్మంతమ్మ, గోవిందమ్మ, నర్సమ్మ, స్రవంతి, ఈరమ్మలుగా గుర్తించారు. -
ఎంపీడీవో కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆస్పరి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా ఆస్పరి గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు ఎస్సీలకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రస్తుతం ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... ఆస్పరి మేజర్ పంచాయతీలోని షాపింగ్ కాంప్లెక్‌ను ఎస్సీలకు కేటాయించేవారు. కాగా ఈసారి ఎస్సీలకు కాకుండా ఇతరులకు కేటాయించడంతో ఆగ్రహించిన మహానంది అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన
ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పేర్లు నమోదు చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని ములుగుండం, వలగొండ, బిల్వకల్లు తదితర గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు మండల కార్యాలయానికి తరలివచ్చారు. అయితే తహశీల్దార్ కార్యాలయంలో లేకపోవటంతో అక్కడి అధికారులకు తమ సమస్య వివరించి వెనుదిరిగారు.