8న రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు
న్యూశాయంపేట : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు వచ్చేనెల 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.రాజ్‌గోపాల్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు మిగతా గవర్నింగ్ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నిక ఉంటుందన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 2 నుంచి 3 వరకు గడువు ఉంటుందన్నారు. 4న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 5న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందన్నారు. పోటీలో ఉన్నవారి జాబితాను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారని చెప్పారు. 8న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని, ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు ప్రకటిస్తామన్నారు. హంటర్‌రోడ్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోటీ చేయదల్చినవారు నామినేషన్ పత్రాలను కార్యాలయంలో పొందాలని సూచించారు.