Assembly committee
-
పెద్దల ఆర్డర్.. అధికారుల గైర్హాజర్!
అసెంబ్లీ కమిటీల సమావేశాలకు డుమ్మా ముఖ్యనేత, మంత్రి మౌఖిక ఆదేశాలే కారణం పోలవరం అక్రమాలు బైటపడతాయనే భయం పీఏసీ, పీఈసీ చైర్మన్ల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), ప్రజా పనుల అంచనాల కమిటీ (పీఈసీ) సమావేశాలు మంగళవారం అర్ధంతరంగా ముగిశాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు గైర్హాజరు కావడంతో ఈ సమావేశాలు రద్దయ్యాయి. ముఖ్యనేత, సంబంధిత శాఖ మంత్రి మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్ల వల్లే అధికారులు ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారని వినిపిస్తోంది. పీఈసీ సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు డుమ్మా కొట్టడంపై చైర్మన్ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన కమిటీ సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు కమిటీ సమావేశాలకు అధికారులు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. పెద్దల మౌఖిక ఆదేశాలే కారణమా: పోలవరం ప్రాజెక్టులో అక్రమాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడలో భాగంగానే ఈ రెండు కమిటీల సమావేశాలకు గైర్హాజరు కావాలని జలవనరుల శాఖ అధికారులకు మంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేశారని వినిపిస్తోంది. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోగానే అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.40,351.65 కోట్లకు పెంచేయడం తెలిసిందే. దీనిపై అంచనాల కమిటీ సభ్యుల్లో అధిక శాతం మంది అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో నిర్వహిస్తామని పక్షం రోజుల క్రితమే జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరావు సహా సంబంధిత ప్రాజెక్టుల అధికారులకు కమిటీ ఛైర్మన్ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వర్తమానం పంపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపులో అక్రమాల గుట్టంతా రట్టవుతుందని ఆందోళన చెందిన ముఖ్యనేత అంచనాల కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కానీ.. సమావేశాన్ని వాయిదా వేసేందుకు మోదుగుల నిరాకరించినట్లు తెలిసింది. దాంతో హైదరాబాద్‌లో నిర్వహించే ఏ కమిటీ సమావేశానికైనా హాజరు కాకూడదంటూ జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యనేత మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాలని ఆదేశించడంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు గత రెండు రోజులుగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం అంచనాల కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. కాగా, సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహించిన కమిటీ.. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, అంచనాలపై సమీక్ష సమావేశం నిర్వహించడానికి ఈనెల 30న పోలవరం హెడ్ వర్క్స్‌ను సందర్శించాలని నిర్ణయించింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పీఏసీ నోటీసులు? సాగునీటి శాఖ అధికారులు హాజరు కాక పోవడంతో ఏపీ పీఏసీ సమావేశం కూడా అర్థాంతరంగా రద్దయ్యింది. విజయవాడలో అమలవుతున్న జెఎన్ఎన్యూఆర్ఎం పనులపై సోమవారం తొలి రోజున సమీక్ష జరిపిన పీఏసీ రెండో రోజు కూడా సమావేశమై వెనుకబడిన అనంతపురం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ శాఖ పనుల పురోగతి, ఇతర అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. అసెంబ్లీకి వచ్చిన పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారులు రాకపోవడంతో వెనుదిరిగారు. పీఏసీ సమావేశాలకు అధికారులు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి బుగ్గన నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో సమావేశాలు వద్దని సీఎం చెప్పినట్లు ఓ అధికారి పేర్కొనడంతో కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ సమావేశాలను 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ందుకు సిద్ధమని అసెంబ్లీ సెక్రటరీ చేసిన ప్రతిపాదనను పీఏసీ తోసిపుచ్చింది. అసెంబ్లీ లేని చోట కమిటీ సమావేశాలు ఎలా పెడతారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌లో అసెంబ్లీ కమిటీల సమావేశాలు జరపరాదని ప్రభుత్వం భావించినట్లయితే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని పీఏసీ చైర్మన్ కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశాలకు ఇరిగేషన్ అధికారులు డుమ్మా కొట్టడం ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. రెండూ ఇరిగేషన్ సబ్జక్టులు కావడం, అందులో అవినీతి బట్టబయలవుతుందన్న భయాలు నెలకొనడంతోనే అధికారులు వీటికి హాజరు కానివ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారని వినిపిస్తోంది. -
నేడు, రేపు ప్రివిలేజెస్ కమిటీ సమావేశం
-
నేడు, రేపు ప్రివిలేజెస్ కమిటీ సమావేశం
- 12 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు - 25, 26 తేదీల్లో అభిప్రాయాలు విననున్న కమిటీ - హైదరాబాద్‌లో సమావేశం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం మంగళ, బుధవారాల్లో హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై వైఎస్సార్సీపీ శాసనసభ్యులు 12 మంది అభిప్రాయాలను విననుంది. కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఈ నెల 15న వీరికి నోటీ సులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నానిగుడివాడ), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజ తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాదరెడ్డి(ప్రొద్దుటూరు) ఈనెల 25న మంగళవారం ఉదయం 11.30 గంటలకు కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది. 26వ తేదీ బుధవారం నాడు అదే సమయానికి కమిటీ ముందు హాజరై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవ య్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం) అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది. -
ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి
పీఏసీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పరిష్కరించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరి గింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరైన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కమిటీకి సమాచారం అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రతి నెలా కనీసం రెండుసార్లు సమావేశాలు జరిపాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఆడిట్‌నూ పీఏసీ పరిధిలోకి తేవాలని ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన మరోమారు సమావేశం కావాలని పీఏసీ నిర్ణయించింది. రెవెన్యూ శాఖలోనూ ఎక్కువగా ఆడిట్ అభ్యంతరాలు పెండింగులో ఉన్నట్లు గుర్తించి వాటిపైనా చర్చించారు. వచ్చే సమావేశంలో పర్యాటకం, యువజన సంఘాల విభాగాలతోపాటు మున్సిపల్ శాఖలపై చర్చించనున్నారు. కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, గువ్వల బాలరాజు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, పాటూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, రాములు నాయక్, శాసన సభా కార్యద ర్శి రాజసదారాం, జాయింట్ సెక్రటరీ నర్సింహా చారి తదితరులు పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. -
ఆత్మహత్యలపై సభలో సమరమే
కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయం * అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ * స్పీకర్, మండలి చైర్మన్‌పై అవిశ్వాసానికి యోచన * సమావేశాలు 20 రోజులు జరపాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, కరవుపై చర్చించేదాకా శాసనసభలో పట్టుబట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నిర్ణయించింది. మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సీఎల్పీనేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు సమావేశమయ్యారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 23న ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు 4 గంటలపాటు చర్చించారు. రైతు ఆత్మహత్యలు, కరవును పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయ వ్యవసాయవిధానం ప్రకటించకపోవడం, వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, సబ్‌ప్లాన్ అమలులో నిర్లక్ష్యం, పార్టీ ఫిరాయింపులు వంటివాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఎన్నో ప్రజా సమస్యలున్నందున సమావేశాలను నాలుగైదు రోజులకే పరిమితం చేయకుండా కనీసం 20 రోజులపాటు నిర్వహించేలా కోరాలని నిర్ణయించారు. రైతు ఆత్మహత్యలపై, కరవుపై చర్చించాలని శాసనసభ మొదటిరోజున వాయిదా తీర్మానం ఇస్తామని, దీనిపై చర్చించేదాకా సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించినట్టుగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయకుండా, కోర్టు నోటీసులను తీసుకోకుండా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్న స్పీకరుపై, శాసనమండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీలో వైఫల్యం వంటివాటిపైనా చర్చకు పట్టుపడతామన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలుకోసం మండల రెవెన్యూ, ఆర్డీఓ, కలెక్లర్ల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులా? మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష ఎమ్మెల్యేపై అధికారపక్షానికి చెందిన గువ్వల బాలరాజు దాడిచేయడం, ఆ మరునాడే ఆ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు తీసుకుపోవడంపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో భద్రాచలం, దుమ్ముగూడెం, గిరిజన ఆదివాసీలు ముంపుబారిన పడకుండా డిజైను మార్చాలంటూ అసెంబ్లీ మొదటి సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినా పట్టించుకోవడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమైన ఈ అంశంపై జానారెడ్డితో సహా సీనియర్ ఎమ్మెల్యేలెవరూ సరైన రీతిలో స్పందించడం లేదని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెబుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం జరిగేలా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను, ప్రధానిని, అధిష్టానాన్ని కలుస్తానని చెప్పారు. చాలా అంశాల్లో వ్యతిరేకత మూ టగట్టుకున్న ప్రభుత్వాన్ని రైతు వ్యతి రేక ప్రభుత్వంగా ఈ శాసనసభ సమావేశాల్లో నిరూపిం చాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సూచించారు. జానా తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై సీఎల్పీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు రీడిజైన్లపై అధ్యయనం చేసిన తరువాతే అభిప్రాయాలు చెబితే బాగుంటుందన్న సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిజైన్ల మార్పును వ్యతిరేకించాల్సిందేనని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని జీవన్‌రెడ్డితో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాగం రంగారెడ్డి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టుల డిజైన్లను మార్చడాన్ని సభలో గట్టిగా వ్యతిరేకించాలని వారు కోరారు. శాసనసభ్యుల సూచనలు, కోరిక మేరకే నడుచుకుంటానని, ప్రభుత్వాన్ని నిలదీసే వారికి మద్దతుగా ఉంటానని వాదనల తరువాత జానా చెప్పారు. సీఎల్పీ నాయకునిగా మద్దతు ఇవ్వడానికే పరిమితం కాకుండా, సభ్యులకు నాయకత్వం వహిస్తూ ప్రభుత్వంపై పోరాడాలని జీవన్‌రెడ్డి సూచించారు.