పెద్దల ఆర్డర్.. అధికారుల గైర్హాజర్!
- అసెంబ్లీ కమిటీల సమావేశాలకు డుమ్మా
- ముఖ్యనేత, మంత్రి మౌఖిక ఆదేశాలే కారణం
- పోలవరం అక్రమాలు బైటపడతాయనే భయం
- పీఏసీ, పీఈసీ చైర్మన్ల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), ప్రజా పనుల అంచనాల కమిటీ (పీఈసీ) సమావేశాలు మంగళవారం అర్ధంతరంగా ముగిశాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు గైర్హాజరు కావడంతో ఈ సమావేశాలు రద్దయ్యాయి. ముఖ్యనేత, సంబంధిత శాఖ మంత్రి మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్ల వల్లే అధికారులు ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారని వినిపిస్తోంది. పీఈసీ సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు డుమ్మా కొట్టడంపై చైర్మన్ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన కమిటీ సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు కమిటీ సమావేశాలకు అధికారులు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
పెద్దల మౌఖిక ఆదేశాలే కారణమా: పోలవరం ప్రాజెక్టులో అక్రమాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడలో భాగంగానే ఈ రెండు కమిటీల సమావేశాలకు గైర్హాజరు కావాలని జలవనరుల శాఖ అధికారులకు మంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేశారని వినిపిస్తోంది. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోగానే అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.40,351.65 కోట్లకు పెంచేయడం తెలిసిందే. దీనిపై అంచనాల కమిటీ సభ్యుల్లో అధిక శాతం మంది అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాలపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో నిర్వహిస్తామని పక్షం రోజుల క్రితమే జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరావు సహా సంబంధిత ప్రాజెక్టుల అధికారులకు కమిటీ ఛైర్మన్ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వర్తమానం పంపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపులో అక్రమాల గుట్టంతా రట్టవుతుందని ఆందోళన చెందిన ముఖ్యనేత అంచనాల కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కానీ.. సమావేశాన్ని వాయిదా వేసేందుకు మోదుగుల నిరాకరించినట్లు తెలిసింది.
దాంతో హైదరాబాద్‌లో నిర్వహించే ఏ కమిటీ సమావేశానికైనా హాజరు కాకూడదంటూ జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యనేత మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించాలని ఆదేశించడంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు గత రెండు రోజులుగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం అంచనాల కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. కాగా, సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహించిన కమిటీ.. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, అంచనాలపై సమీక్ష సమావేశం నిర్వహించడానికి ఈనెల 30న పోలవరం హెడ్ వర్క్స్‌ను సందర్శించాలని నిర్ణయించింది.
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పీఏసీ నోటీసులు?
సాగునీటి శాఖ అధికారులు హాజరు కాక పోవడంతో ఏపీ పీఏసీ సమావేశం కూడా అర్థాంతరంగా రద్దయ్యింది. విజయవాడలో అమలవుతున్న జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పనులపై సోమవారం తొలి రోజున సమీక్ష జరిపిన పీఏసీ రెండో రోజు కూడా సమావేశమై వెనుకబడిన అనంతపురం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ శాఖ పనుల పురోగతి, ఇతర అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. అసెంబ్లీకి వచ్చిన పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారులు రాకపోవడంతో వెనుదిరిగారు. పీఏసీ సమావేశాలకు అధికారులు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి బుగ్గన నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈమేరకు ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో సమావేశాలు వద్దని సీఎం చెప్పినట్లు ఓ అధికారి పేర్కొనడంతో కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ సమావేశాలను 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ందుకు సిద్ధమని అసెంబ్లీ సెక్రటరీ చేసిన ప్రతిపాదనను పీఏసీ తోసిపుచ్చింది. అసెంబ్లీ లేని చోట కమిటీ సమావేశాలు ఎలా పెడతారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌లో అసెంబ్లీ కమిటీల సమావేశాలు జరపరాదని ప్రభుత్వం భావించినట్లయితే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని పీఏసీ చైర్మన్ కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశాలకు ఇరిగేషన్ అధికారులు డుమ్మా కొట్టడం ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. రెండూ ఇరిగేషన్ సబ్జక్టులు కావడం, అందులో అవినీతి బట్టబయలవుతుందన్న భయాలు నెలకొనడంతోనే అధికారులు వీటికి హాజరు కానివ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారని వినిపిస్తోంది.